తెలంగాణలో హంగ్.. ఇండియా టుడే - సీ వోటర్ సర్వేలో అంచనా

తెలంగాణలో హంగ్..   ఇండియా టుడే - సీ వోటర్ సర్వేలో అంచనా
  • తెలంగాణలో హంగ్
  • ఇండియా టుడే - సీ వోటర్ సర్వేలో అంచనా 
  • కాంగ్రెస్​కు 54 సీట్లు వస్తయ్ 
  • బీఆర్ఎస్​కు 49 స్థానాలే 
  • బీజేపీకి 8 స్థానాలు.. ఓట్ షేర్ 16 శాతానికి పెరిగే చాన్స్ 
  • ఎంఐఎం సహా ఇతరులకు 11 సీట్లు వస్తాయని వెల్లడి

న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని తాజాగా మరో సర్వేలో తేలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో నిలిచే అవకాశం ఉన్నా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావల్సిన మ్యాజిక్ ఫిగర్ (60 సీట్లు)ను మాత్రం చేరుకోకపోవచ్చని ఇండియా టుడే – సీవోటర్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. 

రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గాను 2018 ఎన్నికల్లో 19 సీట్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ కు ఈసారి 54 సీట్లు రావచ్చని సర్వే తేల్చింది. ఇక 2018 ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 49 స్థానాలకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. పోయిన ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన బీజేపీ.. ఈసారి 8 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 2018లో ఎంఐఎం సహా ఇతరులు11 మంది గెలవగా.. ఈసారి ఆ సంఖ్య 8కి తగ్గొచ్చని వివరించింది.   

కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగే చాన్స్ 

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ భారీగా పెరగనున్నట్లు సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో 28 శాతం ఓట్ షేర్ సాధించిన కాంగ్రెస్.. ఈసారి 39 శాతం ఓట్లను పొందే చాన్స్ ఉందని తేలింది. పోయిన ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 11 శాతం ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 2018లో బీఆర్ఎస్ కు 47 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ పార్టీ ఓట్ షేర్ 9 శాతం తగ్గి 38 శాతానికి పడిపోవచ్చని అంచనా వేశారు. 

ఇక గత ఎన్నికల్లో బీజేపీకి 8 శాతం ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ ఓట్ షేర్ రెట్టింపు అయి 16 శాతానికి పెరుగుతుందని సర్వే తెలిపింది. ఇతరుల ఓట్ల శాతం 18 నుంచి 7కు పడిపోతుందని పేర్కొంది. సర్వే ఫలితాలను చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ బలపడినట్లు కనిపిస్తున్నా.. ఎన్నికలకు మరింత సమయం ఉన్నందున రాజకీయ పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని అనలిస్టులు చెప్తున్నారు.