డీజిల్ వాహనాలను ఆపేదే లే అంటున్న స్వదేశీ కంపెనీలు

డీజిల్ వాహనాలను ఆపేదే లే అంటున్న స్వదేశీ కంపెనీలు

న్యూఢిల్లీ: స్వదేశీ ఆటో కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా (ఎం&ఎం) మాత్రం డీజిల్‌‌‌‌ సెగ్మెంట్​పై ఆశలను వదులుకోలేదు. ఎక్కువ డిమాండ్​ కారణంగా మరికొన్ని కంపెనీలు కూడా వీటి బాటలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డీజిల్​ ఇంజన్ల తయారీకి కఠినమైన రూల్స్​ రావడం, వీటి ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉండటం వల్ల మారుతీ సుజుకీ, రెనాల్ట్​–నిస్సాన్​, ఫోక్స్​వేగన్​ గ్రూపులు వీటి జోలికి వెళ్లడం లేదు. బీఎస్​–6 ఎమిషన్​ రూల్స్​ రెండవ దశకు మారిన తర్వాత డీజిల్​తో నడిచే వెహికల్స్ ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్​యూవీ) అమ్మకాలు బాగుండటం, గత మూడు సంవత్సరాల్లో దేశంలో డీజిల్ వెహికల్స్ ధరల పెరుగుదల వల్ల ఈ రెండు కంపెనీలు డీజిల్​ఇంజన్లను వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. 

ఫోక్స్‌‌‌‌వ్యాగన్ గ్రూప్ ఏప్రిల్ 2020 తర్వాత డీజిల్​ బండ్లు తయారు చేయడమే మానేసింది.  ఇండియా మార్కెట్‌‌‌‌లో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాల్లో ఎస్​యూవీల వాటా ఐదేళ్లలో 40శాతం వరకు పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో మిడ్​–-ఎస్​యూవీ విభాగంలో డీజిల్ వేరియంట్ల వాటా 64శాతం,  హై-ఎండ్ ఎస్​యూవీలలో 94శాతం వాటా ఉంది.  హై-ఎండ్ ఎస్​యూవీలలో  మిడ్​–-ఎస్​యూవీ విభాగంలో 50 శాతం వెహికల్స్​ డీజిల్​వే ఉన్నాయి. 2020 ఆర్థిక సంవత్సరం కార్ల విక్రయాలలో డీజిల్ వెహికల్స్ వాటా  29శాతం నుంచి 18శాతానికి పడిపోయింది.  2020 ఏప్రిల్ నుంచి భారతదేశంలో బీఎస్–6 రూల్స్​ కావడంతో కంపెనీలు 42 హ్యాచ్‌‌‌‌బ్యాక్‌‌‌‌లు, సెడాన్‌‌‌‌లు,  ఎంట్రీ ఎస్​యూవీలలో డీజిల్ ఇంజన్‌‌‌‌ బండ్ల అమ్మకాలను ఆపేశాయి.