‘మిక్స్​డ్ ఆక్యుపెన్సీ’ ఇంటర్ కాలేజీల్లో.. అడ్మిషన్లకు కొత్త రూల్

‘మిక్స్​డ్ ఆక్యుపెన్సీ’ ఇంటర్ కాలేజీల్లో.. అడ్మిషన్లకు కొత్త రూల్

‘మిక్స్​డ్ ఆక్యుపెన్సీ’ ఇంటర్ కాలేజీల్లో.. అడ్మిషన్లకు కొత్త రూల్

స్టూడెంట్స్ నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని బోర్డు నిర్ణయం

వచ్చే ఇయర్ తో ఆ కాలేజీలకు ముగియనున్న పర్మిషన్ గడువు

వాటిలో చేరేందుకు ఇష్టమేనని లేఖలు తీసుకోనున్న అధికారులు 

హైదరాబాద్, వెలుగు : ఇంటర్మీడియెట్​లో అఫిలియేషన్ పంచాయతీ లేకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మిక్స్​డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లో కొనసాగుతున్న  ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై దృష్టి  పెట్టింది. ఇప్పటికే ఆయా కాలేజీలకు రెండేండ్ల పాటు స్పెషల్ పర్మిషన్ ఇవ్వగా, వచ్చే ఏడాదితో ఆ గడువు ముగియనుంది. దీంతో ఆ కాలేజీల్లో ఫస్టియర్ లో చేరే స్టూడెంట్స్​, పేరెంట్స్ నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. ‘‘వచ్చే ఏడాది గుర్తింపు రాకున్నా.. కాలేజీలో చేరుడు మాకిష్టమే’’ అని ఆయా కాలేజీల్లో చేరే స్టూడెంట్ల నుంచి లెటర్లు రాయించుకోనుంది.  

ఏప్రిల్ 30లోపే అఫిలియేషన్ కాలేజీల లిస్టు 

వచ్చే అకడమిక్ ఇయర్ కోసం ప్రైవేటు ఇంటర్​ కాలేజీల అఫిలియేషన్ నోటిఫికేషన్​ను జనవరిలోనే బోర్డు రిలీజ్ చేసింది. ఫైన్ లేకుండా అప్లై చేసేందుకు గడువు ఫిబ్రవరి 21తోనే ముగియగా, రూ.20 వేల ఫైన్​తో ఈ నెల31 వరకు గడువు ఉంది. ఇప్పటికే మెజార్టీ కాలేజీలు ఇందుకు అప్లై చేశాయని చెబుతున్నారు. ఏప్రిల్ 30లోపే అఫిలియేషన్ కాలేజీల లిస్టు ఇస్తామని బోర్డు ప్రకటించింది. ఇప్పటికే సర్కార్ సెక్టార్​లోని 136  కాలేజీలకు బోర్డు గుర్తింపు కూడా ఇచ్చేసింది. వాటి వివరాలనూ వెబ్ సైట్​లో పెట్టింది. ఇదే క్రమంలో మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని (వాణిజ్య సముదాయాలు ఉన్న వాటిలో నడుస్తున్నవి) కాలేజీలకూ ప్రభుత్వం 2022–23, 2023–24 అకడమిక్ ఇయర్లకు గాను ప్రత్యేక అనుమతి ఇచ్చింది. రెండేండ్ల లోపు నిబంధనలకు అనుగుణంగా ఉన్న భవనాల్లో కాలేజీలు నిర్వహించాలని సూచించింది. ఈ గడువు వచ్చే విద్యా సంవత్సరం(2023–24)తో ముగియనుంది.  

ఒక్క ఏడాదే గుర్తింపు..

వచ్చే విద్యా సంవత్సరం మాత్రమే మిక్స్​డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లోని కాలేజీలకు గుర్తింపు ఉండనుంది. ఈ లెక్కన 2023–24లో ఫస్టియర్ లో చేరే స్టూడెంట్లకు సెకండియర్ ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న సుమారు 400 ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే స్టూడెంట్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకోనుంది. తాము చేరే కాలేజీకి 2024-–-25 అకడమిక్ ఇయర్​లో గుర్తింపు ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదని వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకోనుంది.