జల వివాదాలపై కమిటీలో 12 మంది. ? రెండు రోజుల్లో కేంద్రానికి లిస్ట్

జల వివాదాలపై కమిటీలో 12 మంది. ? రెండు రోజుల్లో కేంద్రానికి లిస్ట్
  • కేంద్రం నుంచి జలశక్తి సెక్రటరీ, సీడబ్ల్యూసీ సీఈకి చాన్స్​
  • తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున అధికారులకు చోటు
  • సెక్రటరీలు, ఈఎన్​సీలు, ఇంటర్​స్టేట్​ వింగ్​ ఉన్నతాధికారులకు అవకాశం
  • అధికారుల జాబితాపై నేడు ఉత్తమ్​ రివ్యూ
  • సోమవారం కల్లా కేంద్రానికి లిస్ట్​ పంపనున్న రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సంబంధించి కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్​ శాఖ కసరత్తు స్పీడప్​ చేసింది. రెండు రోజుల కింద ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ ​పాటిల్​ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇరిగేషన్ ​మంత్రుల సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగునీటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఈ నేపథ్యంలోనే కేంద్రం, తెలంగాణ, ఏపీ నుంచి 12 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ కమిటీకి కేంద్రం నుంచి జలశక్తి శాఖ సెక్రటరీ, సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) సీఈ నేతృత్వం వహించనున్నట్టు సమాచారం. ఇక, ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున అధికారులకు కమిటీలో చోటు కల్పించనున్నారు. రెండు రాష్ట్రాల ఇరిగేషన్​ సెక్రటరీలు, ఈఎన్​సీలు, సీఈ స్థాయి అధికారులు, ఇంటర్​స్టేట్​ వింగ్​ అధికారులను కమిటీలోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రం తరఫున కమిటీలోకి తీసుకోవాల్సిన అధికారుల జాబితాపై శనివారం ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి జలసౌధలో రివ్యూ నిర్వహించనున్నట్టు తెలిసింది.

సోమవారం కల్లా కేంద్రానికి లిస్ట్

కమిటీని వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం కల్లా కమిటీని ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా రిపోర్ట్​ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం నాటికి మన లిస్ట్​ను కేంద్రానికి పంపాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. కాగా, కమిటీలో గట్టిగా గళం వినిపించే అధికారులనే తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇరిగేషన్​ సెక్రటరీతో పాటు.. ఈఎన్​సీ జనరల్​ను కమిటీలోకి తీసుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. దాంతో పాటు ఇంటర్​స్టేట్​వింగ్​ నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం లభించొచ్చని తెలుస్తోంది. వారితో పాటు ఒక సీఈకి కమిటీలో అవకాశం కల్పించే చాన్స్ ఉన్నట్టు సమాచారం. వీరిని కమిటీలో నియమిస్తే తెలంగాణ డిమాండ్లపై తమ గళాన్ని గట్టిగా వినిపించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటు ఏపీలోనూ సెక్రటరీతో పాటు ఈఎన్​సీ, విజయవాడ సీఈ, బనకచర్ల ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారికీ చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 

మరీ ఎక్కువ మంది లేకుండా..

కమిటీలో మరీ ఎక్కువ మంది కాకుండా పరిమిత సంఖ్యలోనే సభ్యులను నియమించాలని కేంద్రం సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే 12 మందితోనే కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. మరీ ఎక్కువ మంది ఉన్నా గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని, అందువల్ల రెండు రాష్ట్రాల్లోని ఉన్నత స్థాయి అధికారుల వరకే కమిటీలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. కమిటీని ఏర్పాటు చేశామంటే చేశామని కాకుండా.. రిజల్ట్​ వచ్చేలా కృషి చేయాలని ఇప్పటికే కేంద్రం సంకేతాలు ఇచ్చినట్లు ఇరిగేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు.  కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలు, సమస్యలు, కేటాయింపులు, రెండు రాష్ట్రాల డిమాండ్లపై చర్చించనున్నారు. వీటన్నింటికీ సంబంధించిన పరిష్కారాలపై నెలలో కేంద్రానికి రిపోర్ట్​ ఇచ్చేలా కమిటీ కసరత్తు చేయనుందని చెబుతున్నారు.