
- భయం గుప్పిట్లో పాలస్తీనియన్లు
- నార్త్ నుంచి సౌత్‌కు వేలాదిగా ప్రయాణం
గాజా : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులకు తెగబడుతున్నది. బాంబుల వర్షం కురిపిస్తూ.. గాజా భూభాగంలోకి చొచ్చుకెళ్తున్నది. హమాస్మిలిటెంట్లను టార్గెట్ చేసుకుని సొరంగాలను కూల్చేస్తున్నది. నివాస ప్రాంతాలపై కూడా దాడులు చేస్తుండటంతో వేలాది మంది పాలస్తీనియన్లు సౌత్ గాజా వైపు వెళ్లిపోతున్నారు. హమాస్ మిలిటెంట్లు దాక్కున్న బిల్డింగ్‌లను చుట్టుముట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. బందీలను విడిచిపెట్టేదాకా దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టంచేసింది. గాజా స్ట్రిప్ నడిబొడ్డుకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 130 టన్నెల్స్ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. సొరంగాలు, రాకెట్ లాంచర్లు, ఇతర మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసేందుకు కంబాట్ ఇంజనీరింగ్ విభాగం ఎంతో సహాయపడుతుందని వివరించింది. నార్త్ గాజాలోని అల్ షిఫా హాస్పిటల్లో ఇంకా వేలాది మంది గాయపడిన వాళ్లు ఉన్నారు.
ఇజ్రాయెల్ దళాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న వీడియోను హమాస్ మిలిటెంట్లు గురువారం రిలీజ్ చేశారు. అక్టోబర్ 7 నుంచి ఇప్పటి దాకా 1,400 మంది ఇజ్రాయెలీలు, 11వేల మంది వరకు పాలస్తీనియన్లు చనిపోయారు. మిలిటెంట్ల చెరలో 239 మంది బంధీలుగా ఉన్నారు. కాల్పులు విరమించాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పట్టించుకోవడంలేదు. హమాస్‌ను అంతంచేసే దాకా యుద్ధం ఆగదని తేల్చిచెబుతున్నారు. గాయపడిన పాలస్తీనియన్లు, విదేశీయులను గాజా స్ట్రిప్ నుంచి ఈజిప్ట్‌కు రఫా క్రాసింగ్ ద్వారా తరలించడాన్ని ఇజ్రాయెల్ నిలిపివేసిందని హమాస్ తెలిపింది. గాజాలో చిక్కుకున్న ప్రజలకు ఎలా సహాయం చేయాలన్నదానిపై చర్చించేందుకు వెస్ట్రన్, అరబ్ దేశాలు, యూనైటెడ్ నేషన్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ గురువారం పారిస్‌లో సమావేశం అయ్యాయి.