ముండ్లబాటలా మూడో లిస్ట్! కమలం పార్టీకి పొత్తు తలనొప్పి

ముండ్లబాటలా మూడో లిస్ట్! కమలం పార్టీకి పొత్తు తలనొప్పి
  • ముండ్లబాటలా మూడో లిస్ట్!
  • కమలం పార్టీకి పొత్తు తలనొప్పి
  • కూకట్ పల్లి, శేరిలింగంపల్లికి గ్లాస్ పార్టీ పట్టు
  • వదులుకోవద్దంటూ బీజేపీ లోకల్ లీడర్ల ఒత్తిడి
  • పలు సెగ్మెంట్లలో కొనసాగుతున్న ఆందోళనలు
  • సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనూ చిక్కులు
  • ఎటూ తేల్చుకోలేక ఢిల్లీబాట పట్టిన రాష్ట్ర నేతలు

హైదరాబాద్ : బీజేపీకి మూడో లిస్టు తయారు చేయడం ముండ్లబాటలా మారింది. జనసేనతో పొత్త నేపథ్యంలో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సెగ్మెంట్లను ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఈ సెగ్మెంట్లను వదులుకోవద్దని బీజేపీ నేతలు పట్టుబట్టుతున్నారు. స్థానిక కమలం నేతల ఆందోళన నిరసన రూపం దాల్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. దీంతో పాటు నర్సాపూర్ సెగ్మెంట్ ను మురళీ యాదవ్ కు కేటాయించడంపై స్థానిక బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

ఈ స్థానాన్ని గణేశ్​ కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాల టికెట్ల కేటాయింపు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఖైరతాబాద్ స్థానాన్ని చింతల రామచంద్రారెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. మిగతా ఆరు సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక కత్తమీద సాములా మారింది. ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు.

మెజార్టీ సీట్లు తమకే ఇవ్వాలని బీసీ నేతలు పట్టుబట్టుతున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ను మేకల సారంగపాణి, బండా కార్తీకరెడ్డి, జూబ్లీహిల్స్ సెగ్మెంట్ టికెట్ ను పద్మ వీరపనేని, లంకల దీపక్ రెడ్డి, సనత్ నగర్ టికెట్ ను మర్రి శశిధర్ రెడ్డి, ఆకుల విజయ, కేతినేని సరళ ఆశిస్తున్నారు. ముషీరాబాద్ టికెట్ కోసం బండారు దత్తాత్రేయ కుమార్తె విజయ లక్ష్మి, ఎంపీ లక్ష్మణ్ అనుచరుడు గోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు.

అంబర్ పేట సెగ్మెంట్ టికెట్ రేసులో హైదరాబాద్ బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, మాజీ మంత్రి కృష్ణయాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. జూబ్లీ హిల్స్, ముషీరాబాద్, నాంపల్లిల్లో ఏదో ఒక స్థానాన్ని తనకు కేటాయించాలని విక్రం గౌడ్ కోరుతున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను ఎట్టిపరిస్థిలో జనసేనకు ఇవ్వొద్దంటూ ఆందోళనలు మిన్నంటాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

శేరిలింగంపల్లి టికెట్ ను రవి యాదవ్ కే ఇవ్వాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టబట్టుతున్నారు. రవియాదవ్ అభ్యర్థిత్వానికి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా మద్దతు పలుకున్నట్టు సమాచారం. మెదక్ జిల్లా నర్సాపూర్ టికెట్ ను మార్చాలని గోపికి కేటాయించాలని కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. మురళీయాదవ్ భూకబ్జాదారుడని వారు ఆరోపించారు. 

నాకొద్దు.. నేను పోటీ చేయ

మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును పార్టీ అధినాయకత్వం కోరుతోంది. కానీ ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రాంచందర్ రావు బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ సెగ్మెంట్ పరిధిలో సుమారు 75 వేల బ్రాహ్మణ ఓట్లున్నాయి. ఆయనను బరిలోకి దింపడం ద్వారా ఆ ఓట్లన్నీ గంపగుత్తగా పడుతాయని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. 2018లో ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయగా 40,451 ఓట్లు వచ్చాయి. రాంచందర్ రావు సెకండ్ ప్లేస్ లో నిలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ రాంచందర్ రావు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయనను బరిలోకి దింపితే విజయం సునాయసమని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నా.. పోటీకి రాంచందర్ రావు సిద్ధంగా లేరని సమాచారం. ప్రధానంగా ఆయన ఎన్నికల ఖర్చుకు భయపడే వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. 

వేములవాడలో ఇద్దరు

వేముల వాడ టికెట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తొలనొప్పిగా మారింది. కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈటలతోపాటు బీజేపీలో చేరిన ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాను పార్టీలో చేరిందే వేములవాడ టికెట్ కోసమని ఉమ చెబుతున్నారు. ఇదే సీటుపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు గురి పెట్టారు. చెన్నమనేని వికాస్ రావు టికెట్ కోసం బండి సంజయ్, గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందనేని తేలాల్సి ఉంది.

నవంబర్ ఫస్ట్ తర్వాతే థర్డ్ లిస్ట్

మూడో జాబితా తయారీకి ఆటంకాలు ఎదురవుతుండటం, నాయకులు టికెట్ల కోసం పట్టుబట్టుతుండటంతో అధిష్టానంతో చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్తుతున్నారు. ఎల్లుండి పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చించిన తర్వాతే మూదో జాబితా విషయాన్ని కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది.