
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. తెలంగాణలో తొలిసారి పోటీచేసిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ గ్లాస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ కనీసం పోటీలో నిల్వలేకపోయింది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న జనసేన.. ఎనిమిది స్థానాల్లో పోటీచేసింది. ఈ అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు.
ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసింది. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. అనుకున్నట్లు జరగలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) గెలిచారు.