తెలంగాణలో పత్తాలేని జనసేన.. కనీసం డిపాజిట్లు దక్కలేదు

తెలంగాణలో పత్తాలేని జనసేన..  కనీసం డిపాజిట్లు దక్కలేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. తెలంగాణలో తొలిసారి పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ గ్లాస్‌ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ కనీసం పోటీలో నిల్వలేకపోయింది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న జనసేన.. ఎనిమిది స్థానాల్లో పోటీచేసింది. ఈ అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు.

ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసింది. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. అనుకున్నట్లు జరగలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) గెలిచారు.

* ఖమ్మం నుంచి జనసేన తరపున బరిలో నిలిచిన మిర్యాల రామకృష్ణ ఓడిపోయారు. ఇక్కడి నుంచి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. మిర్యాల రామకృష్ణకు 2 వేల 355 ఓట్లు మాత్రమే వచ్చాయి. తుమ్మల నాగేశ్వరావుకు 82 వేల 74 ఓట్లు పడ్డాయి. 

* కొత్తగూడెం నుంచి జనసేన తరపున బరిలో నిలిచిన లక్కినేని సురేందర్ రావు ఓడిపోయారు. ఈయనకు కేవలం ఒక వెయ్యి 922 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొత్తగూడెం నుంచి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది. రెండోస్థానంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో నిలిచిన జలగం వెంకట్రావు ఉన్నారు. జనసేన అభ్యర్థి సురేందర్ రావు మాత్రం నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 

* వైరా నుంచి జనసేన తరపున బరిలో నిలిచిన సంపత్ నాయక్ ఓడిపోయారు. ఈయనకు కేవలం 2 వేల 712 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు రాందాస్ గెలిచారు. రాందాస్ కు 93 వేల 913 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ నిలిచారు. సంపత్ నాయక్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

* అశ్వారావుపేట నుంచి జనసేన తరపున బరిలో నిలిచిన ఉమాదేవి ఓడిపోయారు. ఈమెకు కేవలం 2 వేల 281 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ గెలిచారు. ఈయనకు 74 వేల 993 ఓట్లు పడ్డాయి. రెండోస్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు నిలిచారు. ఈయనకు 46 వేల 88 ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి ఉమాదేవి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 

* కూకట్ పల్లి నుంచి జనసేన తరపున బరిలో నిలిచిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ ఓడిపోయారు. ఈయనకు 39 వేల 830 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలిచారు. ఈయనకు ఒక లక్షా 35 వేల 635 ఓట్లు పడ్డాయి. 

*  తాండూరు నుంచి జనసేన తరపున పోటీ చేసిన శంకర్ గౌడ్ ఓడిపోయారు. ఈయనకు కేవలం 3 వేల 971 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి గెలిచారు. ఈయనకు 83 వేల 684 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిపైలెట్ రోహిత్ రెడ్డి నిలిచారు. ఈయనకు 77 వేల 763 ఓట్లు వచ్చాయి.

* కోదాడ నుంచి జనసేన తరపున పోటీ చేసిన మేకల సతీష్ రెడ్డి ఓడిపోయారు. ఈయనకు కేవలం ఒక వెయ్యి 827 ఓట్లు మాత్రమే వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి గెలిచారు. పద్మావతి 47 వేల 188 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ పై గెలుపొందారు. 

* నాగర్‌కర్నూలు నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వంగ లక్ష్మణ్ గౌడ్ ఓడిపోయారు. ఈయనకు కేవలం ఒక వెయ్యి 76 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐదో స్థానానికి పరిమితమయ్యారు. నాగర్‌కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి గెలుపొందారు. ఈయనకు 85 వేల 431 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి నిలిచారు. ఈయనకు 80 వేల 827 ఓట్లు వచ్చాయి.