ఇండియా బెస్ట్ షూటర్.. పదేళ్లకు పైగా డామినెన్స్.. కోచ్ జస్పాల్ రాణా ప్రస్థానం !

ఇండియా బెస్ట్ షూటర్.. పదేళ్లకు పైగా డామినెన్స్.. కోచ్ జస్పాల్ రాణా ప్రస్థానం !

భారత షూటింగ్ కోచ్.. ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్..  ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా (49) మృతి తో క్రీడాలోకి తీవ్ర విషాదంలో మునిగింది.  ఆసియా , కామన్వెల్త్ గేమ్స్ లో అత్యధిక మెడల్స్ సంపాదించి భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన రాణా.. అతి చిన్న వయసులో (49), మరెన్నో విజయాలు సాధించాల్సి ఉండగా చనిపోవడం బాధాకరం.  భారత పిస్టల్ షూటర్లకు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా పనిచేస్తున్న రాణా, మ్యూనిచ్‌లో జరిగిన ISSF ప్రపంచ కప్ నుంచి ఇండియాకు తిరిగి వస్తుండగా గుండెపోటుతో మరణించారు. 

మను భాకర్ వంటి షూటర్లను తీర్చిదిద్దిన కోచ్ రాణా.. ఆయన సేవలకు గాను ఐదేళ్ల క్రితమే ద్రోణాచార్య అవార్డు సాధించారు. ఇండియాలో గొప్ప కోచ్‌లలో ఒకరిగా ఎదగక ముందే, రాణా అత్యుత్తమ పిస్టల్ షూటర్లలో ఒకరిగా నిరూపించుకున్నారు. 

1976 జూన్ 28న ఉత్తరాఖండ్‌లో జన్మించిన రాణా, 1994లో అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకున్నారు. మిలన్‌లో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో, జూనియర్ విభాగంలో ప్రపంచ రికార్డు స్కోరుతో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరం తరువాత, ఆసియా క్రీడలలో 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి, అత్యున్నత స్థాయిలో పదేళ్లకుపైగా తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.

రాణా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలుచుకుని, అత్యంత సక్సెస్ ఫుల్ షూటర్లలో ఒకరిగా ఎదిగారు. 9 గొల్డ్ మెడల్స్  సహా 15 పతకాలు సాధించి, ఇప్పటికీ  ఇండియా సక్సెస్ ఫుల్ కామన్వెల్త్ గేమ్స్ షూటర్‌గా నిలిచాడు.

2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడలలో మూడు బంగారు పతకాలు గెలుచుకుని, 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డును సమం చేయడం రాణా కెరీర్ లోనే టాప్ పర్ఫామెన్స్ గా మిగిలిపోయింది.  18 ఏళ్ల వయసులో అర్జున అవార్డును అందుకుని, మూడేళ్ల తర్వాత పద్మశ్రీ పొందటం అంటే ఆయన ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

1994, 1998, 2002, 2006 - ఇలా నాలుగు కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్లలో, ఇండియాకు డిపెండబుల్ చాంపియన్స్ లో ఒకరిగా నిలిచాడు. ఇండియాలో షూటింగ్‌ను బలమైన క్రీడాంశాలలో ఒకటిగా స్థాపించడంలో ఆయన కృషి ఎప్పటికీ నిలిచే ఉంటుంది.