కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు

కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు
  • రైతు సదస్సులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
  • ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని బద్నాం చేద్దామనుకున్నడు
  • కేసీఆర్‌‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపు
  • రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన: మురళీధర్ రావు

నిర్మల్, వెలుగు: తెలంగాణ సంపదను ఆంధ్రా కాంట్రాక్టర్లకు సీఎం కేసీఆర్ ధారపోస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఏపీ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా చేసిన ఘనత కేసీఆర్‌‌‌‌కే దక్కుతుందన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ నిర్వహించిన రైతు సదస్సుకు ఎంపీ సోయం బాపూరావు, సీనియర్​ నేత మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని వివేకానంద చౌక్ నుంచి నిర్వహించిన భారీ ఎడ్ల బండ్ల ర్యాలీల్లో నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా కాంట్రాక్టర్లను తరిమికొట్టాలన్న కేసీఆర్, అధికారంలోకి రాగానే పూర్తిగా మారిపోయాడు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను 30 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచారు. కమీషన్లు రావనే సదర్మాట్ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు” అని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారంతో కేంద్రాన్ని బద్నాం చేయాలన్న కేసీఆర్​ ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన వల్లే ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. కరోనా సమయంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్​ను రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేయలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని వివేక్ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్‌‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం: మురళీధర్​రావు
టీఆర్ఎస్‌‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌‌చార్జ్‌‌ మురళీధర్ రావు విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని, ప్రజాస్వామ్య వాతావరణం కనుమరుగైందన్నారు. ప౦డిన ప్రతి గింజను కేంద్రం కొ౦టున్నదని, కానీ కేసీఆర్ దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శ్రీరాముడు, హనుమాన్ శోభాయాత్రలను శాంతియుతంగా నిర్వహించుకునే పరిస్థితి లేకుండా  పోయిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కేసీఆర్ అవినీతి అక్రమాలను బయటపెడుతామన్నారు. దేశమంతా రైతులు ఆనందంగా ఉన్నారని.. కేవలం తెలంగాణలో మాత్రమే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సహజ వనరుల్ని కేసీఆర్, కేటీఆర్ అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నరు: సోయం బాపురావు
బీజేపీకి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. టీఆర్ఎస్ ప్రజా..రైతు వ్యతిరేక విధానాలు ఆ పార్టీని భూస్థాపితం చేయబోతున్నాయన్నారు.
సింగరేణికి 20 వేల కోట్ల బకాయిలు ఎందుకు ఇప్పిస్తలే
మందమర్రి/నస్పూర్, వెలుగు:
సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘‘సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నదే సీఎం కేసీఆర్. తాడిచెర్ల మైన్‌‌లో కేసీఆర్ కుటుంబానికి వాటా ఉంది. ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రూ.20 వేల కోట్ల బకాయిలు రావాల్సిన ఉన్నా.. రాష్ట్ర సర్కార్ ఎందుకు ఇప్పించడం లేదు” అని నిలదీశారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 బొగ్గు గనిపై సింగరేణి కోల్​మైన్స్ కార్మిక సంఘ్​(బీఎంఎస్​) ‘సింగరేణి కార్మిక చైతన్య యాత్ర’ను వివేక్ వెంకటస్వామి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌‌లో వివేక్ మాట్లాడారు. బీఐఎఫ్ఆర్​ లిస్టులో ఉన్న సింగరేణికి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి కాపాడింది తన తండ్రి కాకా వెంకటస్వామి అని గుర్తుచేశారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో టీబీజీకేఎస్ యూనియన్ లీడర్లు, కొందరు ఆఫీసర్లు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థను కేసీఆర్ నాశనం చేస్తున్నారని, లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి తీసుకువస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బొగ్గు ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుతుంటే కార్మికుల సంఖ్య పెరిగాలని, కానీ కార్మికుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆర్కే 6 కొత్తరోడ్, కృష్ణాకాలనీ వంటి సింగరేణి కార్మిక వాడల్లో దాదాపు గంటసేపు వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్ పర్యటించారు.