పాలమూరు జలమయం

పాలమూరు జలమయం
  •    ఎట్టకేలకు గట్టి వర్షం
  •    తడిసి ముద్దయిన పట్టణం

మహబూబ్​నగర్​ అర్బన్/నవాబ్​పేట/జడ్చర్ల, వెలుగు : నాలుగు రోజులుగా పాలమూరులో ముసురు ఉండగా, గురువారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 1,311 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నవాబ్​పేట మండలంలో 120.9, గండీడ్​లో 120.3, బాలానగర్​లో 119.2, హన్వాడలో 100.5, మూసాపేటలో 95.3, కోయిల్​కొండ, రాజాపూర్​ మండలాలలో 90.1 చొప్పున, దేవరకద్రలో 80.2, భూత్పూర్​లో 70.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నవాబ్​పేట మండలం చాకలపల్లిలో ఒక పూర్తిగా కూలిపోగా, ఇంకో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. మహమ్మదాబాద్ మండలం మంగంపేట్ లో 2 ఇండ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా, మంగంపేట్​ తండాలో ఓ ఇల్లు కూలిపోయాయి.

మల్కచెరువు తూము దగ్గర కట్ట కోతకు గురి కావడంతో గండికి తహసీల్దార్  రిపేర్​ చేయించారు. కేశవరావుపల్లిలో రెండు ఇండ్లు కూలిపోయాయి. చాకలిపల్లి గ్రామంలోని చాకలికుంట అలుగుపారింది. అలాగే యన్మన్​గండ్ల పెద్ద చెరువుకు పడిన గండికి నాలుగు నెలల కింద రిపేర్లు చేశారు. కానీ, తూము మూయకపోవడంతో చెరువులో నీరంతా దిగువ ఉన్న వరి పొలాల్లోకి చేరింది. అప్రమత్తమైన రైతులు జేసీబీ సాయంతో తూము మూశారు. కోయిల్​కొండ మండలంలో భారీ వర్షాలకు వీరారం వద్ద లింగాల్​చేడ్​ వాగు ఉధృతంగా పారుతోంది. జడ్చర్ల మండలం కోడ్గల్​ వద్ద దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

యన్మన్​గండ్ల ఎస్సీ హాస్టల్​లో పైకప్పు ఉరుస్తుండడంతో హాస్టల్​లోని గదుల్లోకి వర్షపు నీళ్లు చేరాయి. కిటికీలకు తలుపులు లేకపోవడంతో వర్షానికి నీళ్లు చేరాయి. దీంతో రాత్రంతా చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. పాలమూరు పట్టణంలో పెద్దచెరువు, ఎర్రకుంట కింద కాలనీలు ముంపునకు గురయ్యాయి. పెద్ద చెరువు అలుగు నుంచి వచ్చిన నీరంతా బీకేరెడ్డి కాలనీ, రామయ్యబౌలి ప్రాంతాలకు చేరాయి.

ఎర్రకుంటకు భారీగా వరద రావడంతో కుంట తూమును తొలగించారు. దీంతో దిగువన ఉన్న గణేశ్​నగర్​లోకి నీళ్లు చేరాయి. అలాగే మహబూబ్​నగర్–​-రాయచూర్​ అంతర్రాష్ట్ర రహదారి మీదుగా నీళ్లు పారాయి. క్రిష్టియన్​పల్లికి వెళ్లే బైపాస్​ వద్ద పెద్ద మొత్తంలో నీళ్లు చేరాయి.

కోయిల్​సాగర్​కు పెరుగుతున్న వరద

దేవరకద్రలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. జూరాల కెనాల్​తో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్ట్​ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 32.5 అడుగులకు గాను, ప్రస్తుతం 19 అడుగులకు చేరింది. 14.5 అడుగుల మేర నీరు చేరితే ప్రాజెక్ట్​ పూర్తి స్థాయిలో నిండనుంది.

నారాయణపేట : ఊట్కూర్​ మండలం చిన్నపొర్ల గ్రామానికి చెందిన కొసిని రాజు ఇల్లు కూలి పోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. జిల్లా  కేంద్రంలోని ఈద్గా కౌంపౌండ్​వాల్​ వర్షాలకు కూలింది. కోస్గిలో 10 సెంటీమీటర్లు, దామరగిద్ద 9, నారాయణపేట 8, ఊట్కూర్​ 6.5, మాగనూర్,  కృష్టలో 6, నర్వలో 4.8, మరికల్​ 5, దన్వాడ 6, మద్దూర్​ 8, గుండుమాల్​ 8, కొత్తపల్లిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆఫీసర్లు తెలిపారు.