కృష్ణాలో నీళ్ల వాటాలు పాత లెక్కనే

కృష్ణాలో నీళ్ల వాటాలు పాత లెక్కనే
  • కృష్ణాలో నీళ్ల వాటాలు పాత లెక్కనే
  • ఏపీకి 66% .. తెలంగాణకు 34%  నీళ్లు
  • కేఆర్ఎంబీ చైర్మన్ నిర్ణయం
  • 50 శాతం వాటా కోసం పట్టుబట్టిన తెలంగాణ
  • తమకు 80 శాతం కృష్ణా నీళ్లివ్వాలన్న ఏపీ
  • కేటాయింపులు బోర్డు పరిధిలో లేవని, గతంలో మాదిరే తీసుకోవాలన్న చైర్మన్
  • శ్రీశైలం స్పిల్‌‌ వే రిపేర్లకు మన వాటా ఇచ్చేందుకు అంగీకారం

హైదరాబాద్‌‌, వెలుగు : 
కృష్ణా నీళ్లను గతంలో మాదిరే తెలంగాణ, ఏపీ పంచుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు నిర్ణయించింది. 2022 – 23 వాటర్‌‌ ఇయర్‌‌లో ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం నీళ్లు తీసుకోవాలని సూచించింది. జలసౌధలో శుక్రవారం కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ ఎంపీ సింగ్‌‌ అధ్యక్షతన బోర్డు 16వ సమావేశం నిర్వహించారు. తెలంగాణ నుంచి ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌, ఈఎన్సీ మురళీధర్‌‌, ఏపీ నుంచి ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శశిభూషణ్‌‌ కుమార్‌‌, ఈఎన్సీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మీటింగ్‌‌ రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. 

సమావేశంలో నీటి వాటాలపై వాడీవేడిగా చర్చించారు. 66 : 34 నిష్పత్తిలో నీటి పంపకాలు 2021 – 22 వాటర్‌‌ ఇయర్‌‌ కోసం తాత్కాలికంగా చేసుకున్న ఒప్పందం మాత్రమేనని, దాన్ని కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోని కృష్ణా బేసిన్‌‌ డిమాండ్‌‌ మేరకు కనీసం 400 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని, ఇందుకు ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను ట్రిబ్యునల్‌‌ నీటి కేటాయింపులు తేల్చేవరకు 2 రాష్ట్రాలకు 50 శాతం చొప్పున తాత్కాలిక పద్ధతిన కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే 50 శాతం నీటి వాటా ఇవ్వాలనే తెలంగాణ ప్రతిపాదనను ఏపీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శశిభూషణ్‌‌ కుమార్‌‌ తోసిపుచ్చారు. తమ రాష్ట్రానికి 80 శాతం కృష్ణా నీళ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. బోర్డు చైర్మన్‌‌ ఎంపీ సింగ్‌‌ జోక్యం చేసుకొని నీటి కేటాయింపుల అంశం బోర్డు పరిధిలో లేదని, ప్రస్తుతానికి  66 : 34 నిష్పత్తిలో పంపకాలు చేసుకోవాలని సూచించారు. దీనికి ఏపీ సమ్మతించగా, తెలంగాణ ససేమిరా అన్నది. దీనిపై కేంద్రం,  సీడబ్ల్యూసీకి లేఖ రాస్తామని తెలంగాణ స్పష్టం చేసింది.

కరెంటు ఉత్పత్తిపై చర్చ
శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తిపైనా బోర్డు మీటింగ్‌‌లో హాట్‌‌ డిస్కషన్‌‌ నడిచింది. పోటాపోటీ కరెంట్‌‌ ఉత్పత్తితో శుక్రవారం నాటికి రిజర్వాయర్‌‌లో కేవలం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, ఇది వాటర్‌‌ మిస్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు అర్థం పడుతోందని బోర్డు పవర్‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌ ఇచ్చింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. వాటర్‌‌ ఇయర్‌‌ ప్రారంభమయ్యే రోజుల్లో రాష్ట్ర కరెంట్‌‌ డిమాండ్‌‌ మేరకే తాము పవర్‌‌ జనరేట్‌‌ చేస్తున్నామని, ఇది క్రైసిస్‌‌ మేనేజ్‌‌మెంటే తప్ప మిస్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కాదని స్పష్టం చేసింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లో పవర్‌‌ జనరేషన్‌‌ రెగ్యులేట్‌‌ చేయడానికి ఆరుగురు సభ్యులతో కమిటీని ఎంపీ సింగ్‌‌ ఏర్పాటు చేశారు. 2 వారాల్లో సమగ్రంగా స్టడీ చేసి ప్రొటోకాల్ రూపొందించాలని సూచించారు.

ప్రాజెక్టుల సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి
సాగర్‌‌ స్పిల్‌‌ వే రిపేర్ల కోసం రూ.20 కోట్లు విడుదల చేస్తూ ఇప్పటికే జీవో ఇచ్చామని రజత్‌‌ తెలిపారు. పులిచింతల గేటు రిపేర్లకు తాము ప్రాధాన్యత ఇస్తామని ఏపీ తెలిపింది. శ్రీశైలం స్పిల్‌‌ వే దిగువన ఏర్పడిన భారీ గుంత పూడ్చడానికి రూ.800 కోట్లతో ప్రతిపాదనలు పంపాలని, వాటిని పరిశీలించి తమ వాటా నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ పేర్కొంది. 

ఆర్డీఎస్‌‌కు 15 టీఎంసీలిస్తే తుమ్మిళ్ల ఆపేస్తం
ఆర్డీఎస్‌‌కు కేటాయించిన 15 టీఎంసీల నీళ్లు ఇస్తే తుమ్మిళ్ల నుంచి ఎత్తిపోతలు ఆపేస్తామని రజత్‌‌ కుమార్‌‌ తెలిపారు. ఒక్క సంవత్సరం కూడా ఆరేడు టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. దీంతో ఆర్డీఎస్‌‌ సమస్యపై టెక్నికల్‌‌ స్టడీ చేసేందుకు పుణెలోని సెంట్రల్‌‌ వాటర్‌‌ అండ్‌‌ పవర్‌‌ రీసెర్చ్‌‌ స్టేషన్‌‌కు ఇవ్వాలని మీటింగ్‌‌లో నిర్ణయించారు.