ఎస్సారెస్పీ భూములకు ఎసరు

ఎస్సారెస్పీ భూములకు ఎసరు

హనుమకొండ, హసన్​ పర్తి, వెలుగు : గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ఎస్సారెస్పీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆఫీసర్ల సపోర్ట్​తో కొందరు అక్రమార్కులు దొంగచాటున ఇంటి నంబర్లు తెచ్చుకుని రిజిస్ట్రేషన్లు కూడా చేసేసుకుంటున్నారు.  దీంతో  కెనాల్​ చుట్టూ కాలనీలు, వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ కబ్జాలకు పాల్పడుతున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. మరికొందరు  రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు.  దీంతో రూ.కోట్ల విలువైన సర్కార్​ భూములు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి.

పొలిటికల్​ అండ.. అధికారుల సపోర్ట్​

వరంగల్​ సిటీలో భూముల రేట్లు గతంతో పోలిస్తే బాగా పెరిగిపోయాయి.  దీంతో మెయిన్​ రోడ్లతో పోలిస్తే తక్కువ రేటుకు ఇస్తామని ప్రచారం చేస్తూ కొంతమంది ఎస్సారెస్పీ భూముల్లో రియల్​ దందా చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన లీడర్ల అండతో అక్రమాలకు పాల్పడుతుంటే.. కొందరు అధికారులు ఆక్రమణల్లో వాటాలు పంచుకుంటున్నారు. ఎస్సారెస్పీ భూములను  కొందరు  ప్లాట్లు చేసి అమ్మేస్తుండగా.. మరికొందరు అగ్గువకు భూములు కొని ఇండ్లు కట్టేస్తున్నారు.  

వాస్తవానికి ఎస్సారెస్పీ కెనాల్​కు ఆనుకొని ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా  ఆ డిపార్ట్​మెంట్​నుంచి ఎన్​వోసీ తప్పనిసరి. కానీ  పోలీస్​ డిపార్ట్​మెంట్​కు చెందిన ఓ ఎస్సై భీమారం శివారులో  కొంతభూమిని  కొనుగోలు చేసి,  జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లను మేనేజ్​ చేసుకుని ఎన్​వోసీ లేకుండానే ఇంటి నంబర్​ కూడా తెచ్చుకున్నట్లు తెలిసింది. అయితే  ఈ విషయం సంబంధిత ఆఫీసర్ల దృష్టికి వెళ్లగా.. వారి ఫిర్యాదు మేరకు ఇంటి నంబర్​ క్యాన్సిల్​ చేసినట్లు సమాచారం.  అధికార పార్టీకి చెందిన ఓ లీడర్​ దర్జాగా ఎస్సారెస్పీ ల్యాండ్​ కబ్జా చేసి ఏకంగా కాంపౌండ్​ కట్టేశాడు.  ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో కొన్ని ఆక్రమణలు బయటపడగా.. అప్పటి అధికారులు కేసులు పెట్టడంతో ఆ వివాదాలు కోర్టు వరకు వెళ్లాయి.  ఓ వైపు కోర్టు కేసులు నడుస్తుండగా.. మరోవైపు అధికారుల సపోర్టుతో ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. 

హద్దులు మార్చి కబ్జాలు 

ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 1980లో సర్కార్​భూమితోపాటు, ప్రైవేట్​ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌ సేకరించి కెనాల్​ నిర్మించారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం భీమారం శివారులోని 193 మంది రైతుల నుంచి 99.39 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. ఆయా భూములకు అప్పటి రేటు ప్రకారం రూ.92.93 లక్షల పరిహారం చెల్లించింది. అయితే కాలువ నిర్మాణం తర్వాత కాలక్రమేణా దాని చుట్టుపక్కల ఉన్న భూములను కొందరు ఆక్రమించడం, హద్దులు జరపడం చేశారు. ఇలా ఆక్రమించుకున్నవారు కొందరు ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు ఇతరులకు అమ్మేశారు. చింతగట్టు నుంచి   భీమారం, పలివేల్పుల మార్గంలో చాలాచోట్ల  కెనాల్ చుట్టూ ఆక్రమణలు పెరిగిపోయాయి.  

యాక్షన్​ తీసుకుంటున్నం

భీమారం శివారులో  ఆక్రమణల విషయం మా దృష్టికి రాగా పోలీస్​ కంప్లైంట్ ఇచ్చాం. మరోచోట ఆక్రమణలపై సర్వే జరుగుతోంది.   మా దృష్టికి వచ్చిన ఘటనల్లో కచ్చితంగా యాక్షన్​ తీసుకుంటున్నాం. ఎస్సారెస్పీ బౌండరీలో కబ్జాలకు పాల్పడితే సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం.  కబ్జాలకు పాల్పడకుండా మళ్లీ సర్వే చేయిస్తాం.

-‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీతారాం నాయక్​, ఎస్సారెస్పీ ఈఈ