మహేశ్ ​కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలె

మహేశ్ ​కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలె

మహాముత్తారం, వెలుగు : పోలీస్​ఈవెంట్స్​లో మృతి చెందిన లింగమల్ల మహేశ్​అంత్యక్రియలు ఆదివారం ఉద్రిక్తతల మధ్య జరిగాయి. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన పోలీస్​ఈవెంట్స్​లో 1600మీటర్ల రన్నింగ్​లో పాల్గొన్న మహేశ్​లక్ష్యాన్ని పూర్తి చేసినా అస్వస్థతకు గురయ్యాడు. ఉస్మానియా హాస్పిటల్​లో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఆదివారం అతడి డెడ్​బాడీని స్వగ్రామమైన జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మహేశ్​కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్, బీఎస్పీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. మహేశ్​ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​చేశారు. డీజీపీని సస్పెండ్ ​చేయాలని, హోం మినిస్టర్​ రాజీనామా చేయాలని, పోలీస్​ రిక్రూట్​మెంట్​ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈవెంట్స్ జరిగే గ్రౌండ్ లో మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు లేకపోవడంతోనే అస్వస్థతకు గురై చనిపోయాడన్నారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఫైర్​ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాటకు దారి తీసింది. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. క్రీడాకారులు, మహేశ్​ స్నేహితులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మంథని ఎమ్మెల్యేతో పాటు బీఎస్పీ లీడర్లు దాసరి హన్మయ్య, గొట్టె రాజు, దూడెపాక సుమన్​, రామిళ్ల రాకేశ్​ పాల్గొన్నారు.