సోషల్ మీడియా ప్రతిరోజూ కొన్ని వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ వీడియో గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. పోలీసు వాహనం పై ఓ వ్యక్తి చెత్త వేయగా, అతడితోనే దాన్ని పోలీసులు క్లీన్ చేయించిన వీడియో నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వివరాలు.. ఒక పోలీసు తన కారును ఆపి పక్కకు వెళ్లగా.. దీన్ని అదనుగా చూసిన ఒక వ్యక్తి పోలీసు కారు పై చెత్త వేశాడు. అతడు కావాలనే చెత్తను వేశాడా లేదనేది తెలియరాలేదు. కానీ పోలీసు కారు లోపల, వెలుపల చెత్తతో నింపేశాడు. పోలీసు తిరిగి కారు దగ్గరకు చేరుకోగానే సదరు వ్యక్తి పారిపోవడానికి పరిగెత్తాడు. దీంతో అతడ్ని పట్టుకోవడానికి పోలీసు కూడా పరిగెత్తాడు. అదే సమయంలో అటు వైపు నుంచి మరో పోలీసు రావడంతో అతడు దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడితోనే చెత్తను క్లీన్ చేయించారు. క్లీనింగ్ తర్వాత అతడి చేతికి బేడీలు వేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ప్రాంక్ వీడియో మాదిరిగా ఉన్న దీన్ని చూసిన నెటిజన్స్ మీ కర్మకు మీరే బాధ్యులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
