కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు Hit Sprayతో వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు Hit Sprayతో వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బొద్దింకల జనతా పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి హిట్ స్ప్రేతో జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి వెళ్లాడు. కాక్రోచ్ జనతా పార్టీ తుక్డే తుక్డే కాంగ్రెస్ ముఠాకు బీ టీమ్ అని ఆరోపించారు. దీంతో సదరు వ్యక్తికి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అతడిని జంతర్ మంతర్ నుంచి వెళ్లగొట్టారు. 

నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే శనివారం (జూన్ 6) ఢిల్లీలోని జంతర్‎మంతర్ దగ్గర సీజేపీ మహా ధర్నా నిర్వహించింది. 

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చారు. ఎయిర్ పోర్టులో అభిజిత్ దీప్కేకు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. సీజేపీ మహాధర్నాకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన యువతతో జంతర్ మంతర్ మహా సంద్రాన్ని తలపించింది.

ఈ కార్యక్రమంలో అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. ‘‘దేశ యువత ఇకపై భయపడదు. వారు పోరాడతారు. బొద్దింకలు కూడా భయపడవు. అవి కూడా ఎప్పటికీ చావవు’’ అని అన్నారు. నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్ చేశారు.