ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. ఎక్కడో తెలుసా..? 

ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. ఎక్కడో తెలుసా..? 

గురుగ్రామ్‌ : హర్యానాలోని గురుగ్రామ్‌ కు చెందిన కోడింగ్‌ నింజాస్‌ అనే ఎడ్‌టెక్‌ కంపెనీ చేసిన నిర్వాకం నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం ఆఫీసుకు సెక్యూరిటీ గార్డుతో తాళాలు వేయించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ గా మారింది. 

వీడియోలో వాచ్‌మెన్‌ ఆఫీసు గ్లాస్ డోర్‌కు తాళాలు వేస్తూ కన్పించారు. అదేంటని అడిగితే.. ‘‘అనుమతి లేకుండా ఏ ఉద్యోగిని బయటకు పంపించొద్దని మేనేజర్‌ చెప్పారు. బయటకు వెళ్లాలంటే పర్మిషన్‌ తెచ్చుకోండి’’ అని వాచ్‌మెన్‌ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘‘కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగుల పని వాతావరణం దిగజారుతోంది. ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో కోడింగ్‌ నింజాస్‌ కంపెనీ స్పందించింది.

‘‘ఈ ఘటనపై మేం స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. మా కంపెనీకి చెందిన ఒక ఆఫీసులో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఓ ఉద్యోగి చేసిన పని కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే.. కొద్ది క్షణాల్లోనే దాన్ని సరిదిద్దాం. సదరు ఉద్యోగి తన పొరబాటును అంగీకరించి క్షమాపణలు కూడా తెలియజేశారు. ఘటన నేపథ్యంలో ఉద్యోగులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ వ్యవస్థాపకులు కూడా విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నాం’’ అని కంపెనీ స్పష్టం చేసింది.

ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, ఇలాంటివి తమ విలువలకు విరుద్ధమని పేర్కొంది. గత ఏడేళ్లుగా భారత యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామని తెలిపింది. అయితే ఈ ఘటన బయటికొచ్చిన తీరు దురదృష్టకరమని, దీని వల్ల అసౌకర్యానికి గురైన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు తెలియజేస్తున్నట్లు  కోడింగ్‌ నింజాస్‌ కంపెనీ వెల్లడించింది.