నిధుల దారి మళ్లింపుపై దర్యాప్తు చేసి రిపోర్ట్​ ఇవ్వండి

నిధుల దారి మళ్లింపుపై దర్యాప్తు చేసి రిపోర్ట్​ ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు :  దళిత అట్రాసిటీ కేసుల్లో బాధితులకు అందాల్సిన నిధులను సర్కారు పక్కదారి పట్టిస్తున్నదన్న ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్​ స్పందించింది. గురువారం రాష్ట్ర సర్కారుకు నోటీసులిచ్చింది.  నిధుల మళ్లింపుపై విచారణకు ఆదేశించింది. నిజానిజాలను విచారించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్సీ కమిషన్​ఆదేశించింది. కాగా అట్రాసిటీ కేసుల్లో దళితులకు అందించాల్సిన మానిటరీ రిలీఫ్​ అండ్​ లీగల్​ ఎయిడ్​ నిధులను రాష్ట్ర సర్కారు పక్కదారి పట్టిస్తున్నదని జాతీయ ఎస్సీ కమిషన్​కు నేషనల్​ అట్రాసిటీస్​ ప్రివెన్షన్​ ఫోర్స్​ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్​ ప్రసాద్​ ఫిర్యాదు చేశారు.

కేంద్రం వాటా రూ.5.36 కోట్లకు తోడు రాష్ట్ర సర్కారు తన వాటానూ విడుదల చేసిందని,  బాధితులకు అందించాల్సిన మొత్తం రూ.12.72 కోట్ల ను సర్కారు పక్కదారి పట్టించిందని ఫిర్యాదులో రాంప్రసాద్​ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో వేయాల్సిన సొమ్మును వేరే అవసరాలకు ప్రభుత్వం మళ్లించిందన్నారు. నిధులను దారి మళ్లించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎస్​కు జాతీయ ఎస్సీ కమిషన్​నోటీసులు జారీ చేసింది. .