
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుని, దివాలా బాటపట్టిన జేపీ ఇన్ఫ్రాటెక్ కొనుగోలుకు సురక్ష గ్రూప్ వేసిన బిడ్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారంనాడు ఆమోదించింది. కొనుగోలు చేసిన ఫ్లాట్లను జేపీ ఇన్ఫ్రాటెక్ పూర్తిచేయలేకపోవడంతో గత ఆరేళ్లుగా 20 వేల మంది ఇండ్ల కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జేపీ ఇన్ఫ్రాటెక్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ) అంగీకారం తెలిపిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్సీఎల్టీ నుంచి అనుమతి వచ్చింది.
నోయిడా, గ్రేటర్నోయిడా, నేషనల్ క్యాపిటల్ రీజియన్లలో చాలా హౌసింగ్ ప్రాజెక్టుల అమలును జేపీ ఇన్ఫ్రాటెక్ చేపట్టింది. విచారణ పూర్తయిన మూడు నెలల అనంతరం తాజాగా జే పీ ఇన్ఫ్రాటెక్ రిజొల్యూషన్ ప్లాన్ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. ఇంటెరిమ్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) నాయకత్వంలో ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయమని ఎన్సీఎల్టీ బెంచ్ ఆదేశించింది. రిజొల్యూషన్ ప్లాన్ అమలుకు వేగంగా చర్యలను ఈ కమిటీ తీసుకోవాలని సూచించింది. ఏడు రోజులలోపు మానిటరింగ్ ఏర్పాటు కావాల్సి ఉంటుంది.
రిజొల్యూషన్ ప్లాన్లో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆయా కొనుగోలుదారులకు అప్పచెప్పాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. నిర్మాణ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయనేది రోజువారీగా మానిటరింగ్ కమిటీ పర్యవేక్షించి, నెలకోసారి ఎన్సీఎల్టీ వద్ద రిపోర్టును ఫైల్ చేయాల్సి ఉంటుంది. 12 కంపెనీలపై ఇన్సాల్వెన్సీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. ఈ మొదటి లిస్టులోనే జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కూడా ఉంది. వివిధ లిటిగేషన్ల కారణంగా జేపీ ఇన్ఫ్రాటెక్ దివాలా ప్రక్రియ చాలా ఆలస్యమైంది.