కొన్ని అద్భుతాలను చూస్తే కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. నమ్మలేనంతగా అనిపిస్తాయి. అలాంటిదే ‘డీప్ డైవ్ దుబాయ్’. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్విమ్మింగ్ పూల్ అడ్వెంచర్ లవర్స్‌కి కొత్త ప్రపంచాన్ని చూసిన ఫీల్ ఇస్తోంది. అడుగడుగునా ఆశ్చర్యపరిచే నిర్మాణాలున్న ‘డీవ్ డైవ్ దుబాయ్’ చాలామంది ఫేవరేట్ లిస్ట్‌లో ఒకటి. డైవర్స్కి లైఫ్ లాంగ్ మెమరీ ఇస్తున్న ఈ పూల్‌లో ప్రతిదీ ప్రత్యేకమే.
ఈ మధ్యనే దుబాయ్ యువరాజు ‘డీప్డైవ్దుబాయ్’ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాంతో ఈ స్విమ్మింగ్ పూల్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సరికొత్త టెక్నాలజీ, సౌకర్యాలు, హై ప్రెజర్ ఎన్విరాన్మెంట్ ఉండే అడ్వాన్స్డ్ హైపర్బారిక్ ఛాంబర్ (డీ కంప్రెషన్ ఛాంబర్) ... ‘డీప్ డైవ్ దుబాయ్’ నిర్మాణంలో కీలకమైనవి. ఈ పూల్ లోతు 196 అడుగులు. ఇందులో కోటి నాలుగు లక్షల లీటర్ల వాటర్ ఉంటుంది.... అంటే ఈ ఒక్క స్విమ్మింగ్ పూల్ ఒలింపిక్స్‌లోని ఆరు ఈత కొలనులకి సమానం.
స్పెషల్ అట్రాక్షన్స్
‘డీప్ డైవ్ దుబాయ్’లోని మరో అట్రాక్షన్ నీట మునిగి ఉన్న నగరం. ఈ స్విమ్మింగ్ పూల్‌లో 6 ఫీట్ల, 21 ఫీట్ల లోపల డ్రై ఛాంబర్ ఉన్న రెండు చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి. అపార్ట్మెంట్, గ్యారేజ్, ఆర్కేడ్ (డిజిటల్ గేమ్స్) వంటివి అదనపు ఆకర్షణ. డైవర్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు లేటెస్ట్ సౌండ్, మూడ్ లైటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ప్రతి ఆరుగంటలకు ఈ పూల్‌లోని వాటర్‌ని ఫిల్టర్ చేసి, నింపుతారు. అందుకోసం సిలికాన్–డై–ఆక్సైడ్ రాక్స్, నాసా డెవలప్ చేసిన ఫిల్టర్ టెక్నాలజీ, యూవీ రేడియోషన్ ఉన్న ఫిల్టర్ సిస్టమ్ వాడతారు. డైవర్స్కి కంఫర్ట్‌గా ఉండేలా ఈ పూల్‌లోని వాటర్30 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండేలా చూస్తారు.
పెరల్ డైవింగ్ హెరిటేజ్ స్ఫూర్తితో
యూఏఈలోని పెరల్ డైవింగ్ హెరిటేజ్‌ని చూశాక, అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించాలనే ఆలోచన వచ్చింది దుబాయ్ టూరిజం అధికారులకు. ఇన్ని వింతలున్న ఈ పూల్‌లో డైవింగ్ కోసం ‘డీవ్డైవ్దుబాయ్.కామ్’ వెట్సైట్లో బుక్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఇన్విటేషన్ ద్వారానే ఆసక్తి ఉన్న డైవర్స్‌ని పిలుస్తున్నారు. పదేళ్లు దాటిన వాళ్లకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అయితే, జూలై చివరికల్లా ఈ పూల్‌ని అందరికీ అందుబాటులోకి తేవాలి అనుకుంటున్నారు. ఈ పూల్‌లో ఫిల్మ్ స్టూడియో కూడా ఉంది. ఎడిటింగ్ రూమ్, వీడియో వాల్, 56 అండర్ వాటర్ కెమెరాలు, డిఫరెంట్ మూడ్స్ కోసం164 మూడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టూడియోలో కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్, మూవీ స్క్రీనింగ్, బర్త్‌డే పార్టీలు, పెళ్లిళ్లకు కూడా అనుమతి ఇస్తున్నారు.
డైవర్స్‌ని గైడ్ చేసేందుకు ఇంటర్నేషనల్ డైవింగ్ ప్రొఫెషనల్స్ టీం ఉంటుంది. వీళ్లు ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ మెళకువలు చెబుతారు. డిస్కవర్, డైవ్, డెవలప్ అని మూడు కేటగిరీల కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ‘డీప్ డైవ్ దుబాయ్’ నిర్వాహకులు. దుబాయ్‌లోని నాడ్ అల్ షెబా 1లో ఉన్న ఈ వండర్ పూల్‌లో డైవింగ్ చేయాలంటే 800 దినార్లు (దాదాపు 16 వేల రూపాయలు) కట్టాలి.
అదే మా కమిట్మెంట్
‘‘డీప్ డైవ్ దుబాయ్’ ప్రతిఒక్కరికి కొత్త అనుభూతిని ఇస్తుంది. డైవర్స్కి మర్చిపోలేని జ్ఞాపకాలు అందించడమే మా టీం కమిట్మెంట్. సేఫ్, కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో డైవింగ్‌కి సంబంధించిన ప్రతిదీ తెలుసుకోవచ్చు ఇక్కడ. థ్రిల్ కోరుకునేవాళ్లు ఈ పూల్‌లో డైవ్ చేసి, నీటి అడుగులోని అద్భుతాల్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఏడాదంతా డైవింగ్ చేయొచ్పు. డైవర్స్కి కొంచెం కూడా హాని జరగకుండా ఇన్స్ట్రక్టర్స్, ఎక్స్పర్ట్ డైవర్స్ చూసుకుంటారు. దుబాయ్‌లో పెరుగుతున్న స్పోర్ట్స్ కల్చర్‌ని చాటేలా నిర్మించిన ఈ పూల్ వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ అవనుంది” అంటున్నాడు ‘డీప్ డైవ్ దుబాయ్’ డైరెక్టర్ జార్రోడ్ జబ్లోన్స్కీ.
