నిజాం ద్రోహి కాదు, ప్రజాహితుడు!

నిజాం ద్రోహి కాదు, ప్రజాహితుడు!

నిజాం పాలన అంటే కేవలం దౌర్జన్యం, మత ఘర్షణలు మాత్రమే ఉన్నాయని, ఆయన ప్రజలకు ద్రోహిగా, క్రూరమైన పాలకుడిగా ఉన్నాడని చిత్రీకరించి ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం నేటికీ జరుగుతోంది. అయితే, నిజాం రాజ్యంలో 1941లో రూపొందించిన జనగణన నివేదిక, ఆనాటి పాలకుల నిజమైన సంస్కరణలను, అభివృద్ధి కార్యక్రమాలను లెక్కలతో సహా ప్రపంచానికి వెల్లడిస్తోంది.  

నిజాం రాజు విద్యకు ఇచ్చిన అత్యంత ప్రాధాన్యత కారణంగా ఆయనకు ‘సుల్తాన్-ఉల్-ఉలూమ్’ ( విద్యలకు రాజు) అనే బిరుదు లభించింది. వారి పాలనలో విద్యావ్యాప్తికి పూర్తి నైతిక,  ఆర్థికమద్దతు అందించడం రాజవ్యవస్థలో స్థాపించిన విధానం.కేవలం అర్ధ శతాబ్ద కాలంలో (1891 నుంచి 1941 వరకు) విద్యకోసం చేసిన ఖర్చు రూ.5,72,814 నుంచి రికార్డు స్థాయిలో  రూ.97,52,242 పెరిగిం ది.  నేటి ఖర్చు ఎంత?  1941 నాటి  రూ.97 లక్షల ఖర్చును నేటి ద్రవ్యోల్బణం,  కొనుగోలు శక్తితో పోలిస్తే  అది నేటి వేల కోట్ల రూపాయలకు సమానం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉచిత విద్య అందించింది. ప్రత్యేక సంస్థల  నివేదిక ప్రకారం, ఈ వర్గాల కోసం రాజ్యంలో మొత్తం 72 ప్రభుత్వ విద్యాసంస్థలు స్థాపించడం జరిగింది. ఆదిలాబాద్‌‌లోని  గోండులు,  కోలాంల కోసం  గోండీ విద్యా పథకం  ప్రవేశపెట్టారు.  వ్యవహారిక ఉర్దూ భాషను నేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతన రాజ్యాంగ సంస్కరణల్లో భాగంగా, నామినేట్ చేసిన హిందూ సభ్యులలో ఐదుగురు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వారికి పరిపాలనా నిర్మాణంలో ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. 1941 నాటికి బాలికల పాఠశాలలు 789కి పెరిగాయి, వీటిలో 11 హైస్కూళ్లు ఉన్నాయి.

నిజాం ప్రభుత్వం అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను ప్రోత్సహించింది. ఓవర్సీస్ స్కాలర్‌‌షిప్‌‌లు/సహాయం..  స్కాలర్‌‌షిప్‌‌లు అనే ఖచ్చితమైన పదం లేనప్పటికీ,  తాత్కాలికంగా రాష్ట్రం వెలుపల (బ్రిటిష్ ఇండియా ప్రావిన్సులు, విదేశాలలో) నివసిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.  నిజాం రాజ్యంలో శాస్త్రవేత్తల పరిశోధనలకు లభించిన ప్రోత్సాహానికి నిదర్శనం సర్ రొనాల్డ్ రాస్.  దోమల ద్వారా మలేరియా సంక్రమణ జరుగుతుందని ఆయన తన ముఖ్యమైన ఆవిష్కరణను హైదరాబాద్‌‌లోని  బేగంపేట  ఆసుపత్రిలో పని చేస్తున్నప్పుడే కనుగొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సంస్థలతో సంబంధం పెట్టుకోవడాన్ని నిషేధించడం ద్వారా మతతత్వ 
రాజకీయాలను దూరం పెట్టారు.  నిజాం ప్రభుత్వంలో హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా షర్వాణీ, ట్రౌజర్‌‌లను ధరించడం ఒక జాతీయ దుస్తులుగా భావించేవారు.  ఇది హైదరాబాద్ ప్రజల మధ్య మత విభేదాలు లేకుండా సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మారింది. నిజాం పాలకులను కేవలం ‘ద్రోహి’గా చిత్రీకరించే రాజకీయ ప్రచారానికి, 1941 నాటి జనగణన నివేదికలోని లెక్కలు, చట్టపరమైన సంస్కరణలు బలమైన సమాధానం ఇస్తున్నాయి.  

ఆర్థిక వ్యవస్థ

గ్రామీణ రుణభారాన్ని తగ్గించడానికి డెట్ కన్సిలియేషన్ యాక్ట్,  మనీ లెండర్స్ యాక్ట్ వంటి చట్టాలను అమలుచేశారు. ఈ చట్టం సురక్షిత రుణాలపై 9 శాతం, అసురక్షిత రుణాలపై 12 శాతం గరిష్ట వడ్డీ రేట్లను నిర్ణయించింది. చక్రవడ్డీ  వసూలు చేయడాన్ని నిషేధించింది.  ల్యాండ్ ఏలియనేషన్ యాక్ట్ ను అమలు చేసి, రైతులు తమ భూములను కోల్పోకుండా రక్షణ కల్పించడానికి ప్రయత్నించారు.  

హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ యాక్ట్ (1941) ను ఆమోదించారు. బ్యాంకింగ్  సేవలను అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.  నిజాం ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లకు పైగా పారిశ్రామిక ట్రస్ట్ ఫండ్‌‌ను ఏర్పాటు చేసింది.  చక్కెర  కర్మాగారం (నిజాం షుగర్ ఫ్యాక్టరీ),  పేపర్ మిల్లుల (సిర్పూర్ పేపర్ మిల్స్) స్థాపనలో ప్రభుత్వం అధిక వాటాలను కలిగి ఉంది.

- వట్టె జానయ్య యాదవ్, 
ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ
రాజ్యాధికార పార్టీ