ఫ్యామిలీలు వలసబాయే.. స్కూళ్లు సిన్నబాయే

ఫ్యామిలీలు వలసబాయే.. స్కూళ్లు సిన్నబాయే
  • లోకల్​గా పనుల్లేక  కర్నాటక, మహారాష్ట్రకు తరలిపోతున్న కుటుంబాలు
  • ఇప్పటికే బడికి దూరంగా1,900 స్టూడెంట్లు
  • సాదుశంకర్​ తండాలో పిల్లలు లేక మూతపడ్డ స్కూల్
  • ప్రతి ఏటా ఇదే తీరు.. శాశ్వత పరిష్కారం చూపని ఆఫీసర్లు 

సంగారెడ్డి/కంగ్టి, వెలుగు: ఊళ్లలో చేద్దామంటే సరైన పనుల్లేక, ఉపాధి పనులు గిట్టుబాటు కాక, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ నియోజకవర్గం నుంచి వేలాది కుటుంబాలు పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్నాటక స్టేట్స్​కు వలస పోతున్నాయి. ఈసారి యాసంగిలో వ్యవసాయ పనులు కూడా దొరకకపోవడంతో మైగ్రేట్​ అయ్యేవారి సంఖ్య పెరిగింది. వీళ్లంతా ఆయా రాష్ట్రాల్లోని చెరుకు ఫ్యాక్టరీల్లో కూలీలుగా చేరి 6 నుంచి 8 నెలల తర్వాత తిరిగి రానున్నారు. కాగా, తల్లిదండ్రుల వెంటే పిల్లలు కూడా వెళ్తుండడంతో దాదాపు అన్ని స్కూళ్లలో అటెండెన్స్​ పడిపోతోంది. ఇప్పటికే 1,900 మంది స్టూడెంట్లు బడి మానేసినట్లు ఎడ్యుకేషన్​ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రధానంగా కంగ్టి మండలంలో ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితే ఉండడంతో స్టూడెంట్లు చదువుకు దూరమవుతున్నారు. దీనికో శాశ్వత పరిష్కారం చూపాల్సిన ఆఫీసర్లు మాత్రం పిల్లలు లేనప్పుడు స్కూళ్లు మూసి, వచ్చాక తెరిచి మమ అనిపిస్తున్నారు.  

ఏటా వలస బాట.. 

నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాగునీటి సౌకర్యం, ఇతరత్రా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఈజీఎస్​ కింద కూలి గిట్టుబాటు కాకపోవడంతో చిన్నసన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు.. పక్కనే ఉన్న కర్నాటక, మహారాష్ట్రతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఉపాధి కోసం వలస పోతుంటారు. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో వెళ్లి అక్కడ చెరుకు ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరి 6 నుంచి 8 నెలల తర్వాత తిరిగి సొంతూళ్లకు వస్తుంటారు. కొన్నేండ్లుగా ప్రతి ఏడాది వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రుల వెంట పిల్లలు కూడా వలస పోతుండడంతో గవర్నమెంట్ స్కూళ్లల్లో అటెండెన్స్ పర్సంటేజ్ పడిపోతోంది. ఒక్కోసారి ఒక్క స్టూడెంట్​ కూడా లేకపోవడంతో స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది. 

ముఖ్యంగా కంగ్టి మండలంలో మొత్తం 50 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా, 4,752 మంది స్టూడెంట్స్ బడికి పోతున్నారు. ఈ ఒక్క మండలం నుంచి ఇప్పటికే దాదాపు 480 మంది పిల్లలు తల్లిదండ్రులతో వలస వెళ్లినట్టు ఎంఈఓ శంకర్ వెల్లడించారు. కంగ్టి మండలం సిద్ధంగిర్గా గ్రామ పంచాయతీ పరిధిలోని సాదుశంకర్ తండాలో వలసల కారణంగా ప్రైమరీ స్కూల్​ను టెంపరరీగా మూసేశారు. స్కూల్​లో మొత్తం 9 మంది స్టూడెంట్స్ ఉండగా అందరూ వలసపోవడంతో ఉన్న ఒక్క టీచర్ ను మండల కేంద్రమైన కంగ్టి హైస్కూల్ కు డిప్యుటేషన్ పై పంపించారు. స్టూడెంట్స్ వలస నుంచి వచ్చాక టీచర్​ను తిరిగి రప్పించి స్కూల్ రీ ఓపెన్ చేయిస్తామని చెబుతున్నారు.

10 శాతం స్టూడెంట్స్​ గైర్హాజరు

సంగారెడ్డి జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ సెగ్మెంట్​లో వలసల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇక్కడున్న 5 మండలాల్లో కంగ్టి, కల్హేర్, నాగల్ గిద్ద మండలాల నుంచి గిరిజనుల వలసలు ఎక్కువగా ఉన్నాయి. నారాయణఖేడ్ సెగ్మెంట్​లో మొత్తం 18,850 మంది స్టూడెంట్స్ బడికి పోతున్నారు. ఇందులో ఇప్పటికే సుమారు 1,100 మంది స్టూడెంట్స్ పేరెంట్స్ తో కలిసి  వలస వెళ్లినట్టు ప్రాథమికంగా ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు బాగోలేక మరో 800 మంది స్టూడెంట్స్ స్కూల్ కి వెళ్లకుండా ఇతరత్రా పనులు చేస్తున్నట్టు ప్రాథమిక సర్వే ద్వారా తెలిసింది. గిరిజన కుటుంబాలకు ఉపాధి మార్గాలు చూపించి వలసలను నివారించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా పరిస్థితులు మారడం లేదు.

వలసలను నివారిస్తేనే..

నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో వలసలను నివారిస్తే తప్ప పిల్లల భవిష్యత్తు బాగుపడదు. వలసలు ఒకవైపు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరోవైపు స్టూడెంట్స్ ను బడికి పోకుండా చేస్తున్నాయి. చదువు మానేసి పనులకు వెళ్లడంతో పిల్లల జీవితాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వలసలు నివారించి పెద్దలకు ఉపాధి మార్గాలు చూపించాలి.

ప్రకాష్ రాథోడ్,  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, లంబాడీ హక్కుల పోరాట సమితి

ఒక్కరొచ్చినా తెరుస్తాం

స్కూల్ కు ఒక్క స్టూడెంట్ వచ్చినా తెరుస్తాం. సాదుశంకర్ తండాలో ఇండ్లు పదుల సంఖ్యలోనే ఉండడంతో స్టూడెంట్స్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంది. తల్లిదండ్రుల వెంట పిల్లలు వలసలకు పోవడం వల్ల ప్రతి ఏడాది ఇదే సమస్య తలెత్తుతోంది. వలసలు తగ్గితే స్టూడెంట్స్ అటెండెన్స్ పెరగవచ్చు. పిల్లలు లేని కారణంగా ప్రస్తుతానికి స్కూల్ బంద్ చేశాం. స్టూడెంట్స్ వలస నుంచి వచ్చాక ఓపెన్ చేస్తాం.  

శంకర్, ఎంఈఓ, కంగ్టి