ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు 62,159

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు 62,159
  • నవంబర్‌‌లో 6,119 రిజిస్ట్రేషన్లు..వాల్యూ రూ.2,892 కోట్లు
  • అక్టోబర్‌‌తో పోలిస్తే 32 శాతం ఎక్కువ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీలో  రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు కిందటి నెలలో 32 శాతం (నెల ప్రాతిపదికన) పెరిగాయి.  నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో హైదరాబాద్‌‌లో 6,119 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి.  వీటి మొత్తం విలువ రూ.2,892 కోట్లు.  ఈ ఏడాదిలో ఇప్పటివరకు సిటిలో 62,159 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరగగా, వీటి మొత్తం విలువ రూ.30,415 కోట్లుగా ఉంది. కిందటేడాది ఇదే టైమ్‌‌లో రూ.33,531 కోట్ల విలువైన 75,453 యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ కింద హైదరాబాద్‌‌, మల్కాజ్‌‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలున్నాయి.

500‑1,000 చదరపు అడుగుల వైపే మొగ్గు..

విస్తీర్ణం పరంగా చూస్తే, 500–1,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు కిందటి నెలలో భారీగా పెరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 22 శాతానికి చేరుకుంది. ఏడాది క్రితం  ఇటువంటి ఇండ్ల  వాటా 15 శాతంగా రికార్డయ్యింది. మరోవైపు 1,000 కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు  మాత్రం భారీగా తగ్గాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌లో మొత్తం ఇండ్ల రిజిస్ట్రేషన్‌‌లో వీటి వాటా 74 శాతంగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో 65 శాతానికి పడింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌ను పరిశీలిస్తే  ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా మేడ్చల్–మల్కాజ్‌‌గిరి జిల్లా నుంచి జరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ జిల్లా వాటా 41 శాతంగా నమోదయ్యింది. 39 శాతం వాటాతో రంగారెడ్డి జిల్లా రెండో ప్లేస్‌‌లో ఉంది. హైదరాబాద్‌‌ జిల్లా వాటా 14 శాతంగా, రంగారెడ్డి జిల్లా వాటా 6 శాతంగా నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లాలో  ఇండ్ల ధరలు భారీగా పెరిగాయని నైట్‌‌ ఫ్రాంక్ వెల్లడించింది.   ఈ జిల్లాలో చదరపు అడుగు ధర ఏడాది ప్రాతిపదికన 42 శాతం పెరిగిందని తెలిపింది. ఇక్కడ చదరపు అడుగు ధర సగటున రూ.3,094 గా ఉంది. హైదరాబాద్ జిల్లాలో చదరపు అడుగు సగటు ధర రూ.4,198 (18 % అప్‌‌), మేడ్చల్–మల్కాజ్‌‌గిరిలో రూ.2,957 (23 % అప్‌‌) గా, రంగారెడ్డిలో రూ.3,823 (మైనస్‌‌ 3%) గా ఉన్నాయి.   మొత్తంగా హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌లో చదరపు అడుగు సగటు ధర రూ.3,513 పలుకుతోంది. ఇది కిందటేడాది నవంబర్‌‌‌‌తో పోలిస్తే 12% ఎక్కువ.  ‘రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్‌‌లో 32 % ( నెల ప్రాతిపదికన) పెరిగాయి. కానీ, ఏడాది ప్రాతిపదికన 21 శాతం తగ్గాయి. జియోపొలిటికల్ టెన్షన్లు కొనసాగుతున్నప్పటికీ, వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ నవంబర్‌‌‌‌లో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌కు కొంత ఉపశమనం దక్కింది.  తక్కువ రేటు ప్రాపర్టీల డిమాండ్ తగ్గుతున్నప్పటికీ, ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ స్ట్రాంగ్‌‌గా ఉంది’ అని నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.   మెరుగైన సోషియో ఎకనామిక్ పరిస్థితులు,  ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఉండడంతో  హైదరాబాద్‌లో  రియల్టీ సెక్టార్‌‌ స్ట్రాంగ్‌‌ ఉందన్నారు.

రూ. 50 లక్షల లోపు ఉన్న ఇండ్లకే గిరాకీ..

రూ.25 నుంచి రూ.50 లక్షల మధ్య విలువున్న  రెసిడెన్షియల్  ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు కిందటి నెలలో ఎక్కువగా జరిగాయని నైట్‌‌ఫ్రాంక్ వెల్లడించింది.  మొత్తం ఇండ్ల రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 50 శాతంగా ఉందని తెలిపింది. కిందటేడాది నవంబర్‌‌‌‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 37 శాతంగా  ఉంది. మరోవైపు రూ.25 లక్షల కంటే తక్కువ విలువున్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఈసారి తగ్గాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌లో జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 39 శాతంగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో 22 శాతానికి  తగ్గింది. పెద్ద ఇండ్లకు డిమాండ్ పెరిగిందని నైట్‌‌ ఫ్రాంక్ వెల్లడించింది. రూ.50‌‌‌‌ లక్షల కంటే ఎక్కువ విలువున్న  రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు నవంబర్‌‌‌‌లో 28 శాతానికి పెరిగాయని, కిందటేడాది నవంబర్‌‌‌‌లో వీటి వాటా 24 శాతంగా ఉందని వివరించింది.