వృద్ధుల డబ్బుకు చెదలు పట్టింది

వృద్ధుల డబ్బుకు చెదలు పట్టింది
  • డబ్బుకు చెదలు పట్టడంతో వృద్ధ దంపతుల కన్నీరుమున్నీరు
  • కాళ్లరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన ఆవేదన
  • ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరిన దంపతులు

భద్రాద్రి కొత్తగూడెం: ఆరుగాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టారు. సంతానం లేకపోయినా కూడబెట్టిన సొమ్ముతో కులాసాగా బతకాలనుకున్నారు. కానీ దాచుకున్న డబ్బుకు చెదలు పట్టడంతో ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని ఇల్లందు మండలం బాలాజీనగర్ లో జరిగింది. గడ్డం లక్ష్మయ్య, ఆయన భార్య లక్ష్మి ఇద్దరు వృద్ధులు. కొన్నేళ్ల కిందటి వరకు లక్ష్మయ్య మేస్త్రీ పని చేసేవాడు. ఆయన భార్య కూలీ పని చేసేది. అలా కష్టపడి రూ.లక్షా 50 వేల వరకు కూడబెట్టారు. ఆ డబ్బును ఇంట్లో ఉన్న ఓ సూట్ కేసులో దాచుకున్నారు. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఆ డబ్బును వాడుకుందామని ఆ దంపతులు భావించారు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బు, రేషన్ బియ్యంతో జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు సూట్ కేసును తెరిచి తమ డబ్బును చూసుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా ఆ సూట్ కేసును తెరవలేదు.

అయితే ఇటీవల కురిసిన వర్షాలకు సూట్ కేసు  తడిసి చెదలు పట్టింది. దీంతో లోపల ఉన్న డబ్బులకు కూడా చెదలు పట్టి పనికి రాకుండా పోయాయి. అయితే డబ్బు అవసరం పడి సూట్ కేసు తెరిచి చూడగా... డబ్బులకు చెదలు పట్టడంతో ఆ వృద్ధ దంపతులు లబోదిబోమన్నారు. గ్రామస్థుల సలహాతో ఇల్లందులోని పలు బ్యాంకుల చుట్టూ తిరిగి డబ్బులను మార్చాలని వేడుకున్నారు. కానీ బ్యాంక్ అధికారులు వారి గోడును పట్టించుకోలేదు. దీంతో అటు సంతానం లేక, ఇటు దాచుకున్న డబ్బు లేక ఆ వృద్ధ దంపతులు బాధపడుతున్నారు. తమ పరిస్థితిని చూసి జాలిపడేవారే తప్ప ఆదుకునేవారు లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని తగిన సాయం చేయాలని ఆ దంపతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.