
నిర్మల్,వెలుగు : నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి పాత, కొత్త లీడర్ల పంచాయితీ తలనొప్పిగా మారింది. ముధోల్, ఖానాపూర్‌లో కొత్తగా టికెట్లు ఆశిస్తున్న లీడర్లు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. నిర్మల్ లో శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్నుంచి శ్రీహరిరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి సత్యనారాయణ గౌడ్ సైతం ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఆయన సతీమణి శోభ ఉమ్మడి జిల్లా పరిషత్ కు చివరి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు బీఆర్ఎస్కు దూరమైతే ఆ పార్టీ క్యాండిడేట్ కు ఇబ్బందులు తప్పేలా లేదని అంటున్నారు. ఇటీవలే నిర్మల్‌లో సత్యనారాయణ గౌడ్‌తో బీజేపీ సీనియర్లీడర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరపడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
మూడు మండలాల్లో పట్టు...
నిర్మల్, మామడ, లక్ష్మణచాంద మండలాల్లో శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్‌కు మంచి పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో వీరు బీఆర్ఎస్ క్యాండిడేట్‌కు సహకరించక పోతే ఇబ్బందులు తప్పవు. అయితే సత్యనారాయణగౌడ్బీజేపీలో చేరితే హైకమాండ్టిక్కెట్టు ఆయనకే కేటాయించే అవకాశమూ ఉంది.
ఖానాపూర్ లో కొత్త నేతలు...
ఖానాపూర్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ కొత్త లీడర్లు హల్ చల్చేస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా చెప్పుకుంటున్న జాన్సన్ నాయక్, ఎంపీ సంతోష్ కుమార్ కు సన్నిహితుడిగా చెప్పుకుంటున్న పూర్ణనాయక్, మాజీ ఐఏఎస్ శరవన్ నాయక్ ఈసారి టికెట్ తమకే దక్కుతుందంటున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్అనుచరులు గందరగోళానికి గురవుతున్నారు.
ముధోల్ లో చారి కదలికలు...
ముధోల్సెగ్మెంట్లో మాజీ ఎంపీ వేణుగోపాలచారి కదలికలు సిట్టింగ్ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఈసారి బీఆర్ఎస్టికెట్ చారికే దక్కుతుందని ప్రచారమూ జరుగుతోంది. అంతేకాదు చారి స్థానిక సీనియర్ లీడర్లతో ఎప్పటికప్పడు టచ్‌లో ఉంటున్నారు. ఈసారి ఆయన ముధోల్ నుంచి బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. దీంతో విఠల్‌రెడ్డి వర్గీయులు గందరగోళానికి గురవుతున్నారు.