మునుగోడులో జోరందుకున్న ప్రచారం

మునుగోడులో జోరందుకున్న ప్రచారం

మునుగోడులో పార్టీల ప్రచారం రోజురోజుకు స్పీడ్ అందుకుంటోంది. ఆత్మీయ సమ్మేళనాలు, గ్రూప్ మీటింగ్ లు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. ఇవాళ టీఆర్ఎస్ మంత్రులు తమ తమ సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగారు. టీఆర్ఎస్ పథకాలు వివరిస్తూనే రాజగోపాల్ వల్లే ఉప ఎన్నిక వచ్చిందంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చండూరులో CPI, CPM ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కూసుకుంట్లకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పనిలో పనిగా కొన్ని సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులు కూసుకుంట్ల దృష్టికి తీసుకెళ్లారు. 

బీజేపీ కూడా దూకుడుగా ప్రచారం చేస్తోంది. అభ్యర్థి రాజగోపాల్ తో పాటు.. స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్,  ఆచారి, రాకేశ్ రెడ్డి ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం శాలివాహన సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. రాజగోపాల్ కు మద్దతు ప్రకటించింది శాలివాహన సంఘం. మధ్యాహ్నం రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి KCR ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధరణి పెద్ద స్కాం అంటూ విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువ చేసే భూములు కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయన్నారు రాజగోపాల్.

చండూరులో కాంగ్రెస్ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టడం ఇవాళ ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ను ఎదుర్కోలేకనే TRS, BJP కలిసి కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నాయని ఆపార్టీ నేతలు విమర్శించారు. పోస్టర్లు తగులబెట్టిన వాళ్లను అరస్ట్ చేయాలంటూ ఆందోళనలు చేశారు. రేవంత్, మాణిక్కం ఠాకూర్ లు ఇదే విషయంపై ట్వీట్లు కూడా చేశారు.