
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పట్నా హైకోర్టు మంగళవారం (ఆగస్టు 1వ తేదీన) కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఏడాది జనవరిలో బీహార్ ప్రభుత్వం కులగణనను ప్రారంభించింది. మొదటి దశ సర్వే జనవరి 7-21 తేదీల మధ్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే15తో ముగియాల్సి ఉండగా.. మే 4న పట్నా హైకోర్టు కులగణన సర్వేపై స్టే విధించింది.
కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం (ఆగస్టు 1వ తేదీన) విచారణ జరిపి వాటిని కొట్టేసింది. అయితే.. పట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది దిను కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ కులాల వారి అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు బీహార్‌లో కులగణన చేపట్టనున్నట్లు గతేడాది సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.