అమర్‌నాథ్‌ యాత్రలో సురక్షితంగా బయట పడ్డ బైంసా యాత్రికుల బృందం

అమర్‌నాథ్‌ యాత్రలో సురక్షితంగా బయట పడ్డ బైంసా యాత్రికుల బృందం

వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్ర ప్రమాదకరంగా మారి నిలిచిపోయింది. జమ్ము–శ్రీనగర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతా ల్లో అమర్‌నాథ్‌ యాత్రీకులు చిక్కుకుపోయారు. ఇందులో భాగంగానే రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బైంసా నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రీకుల బృందం సమస్యలను ఎదుర్కొంది. మార్గమధ్యలో చిక్కుకున్న వారిని సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం సురక్షితంగా రక్షించి.. తమ బేస్ క్యాంపునకు తీసుకెళ్లారు.

ఐదు రోజులు క్రితం బైంసా పట్టణానికి చెందిన 10 కుటుంబాలు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాయి. అయితే.. యాత్ర కొనసాగే జమ్ము–శ్రీనగర్ హైవే మార్గంలో భారీ వర్షాలు కురియడంతో కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో కొంతమంది యాత్రీకులు చిక్కుకుపోయారు. బైంసా యాత్రీకుల బృందం కూడా చిక్కుకపోగా... అక్కడి మార్గంలోని సీఆర్పీఎఫ్ జవాన్లు వారిని రక్షించారు. ఆ తర్వాత బల్తాల్ బేస్ క్యాంపునకు తీసుకువెళ్లి.. వసతి కల్పించారని బృందం ప్రతినిధులు గుజ్జల్వార్ వెంకటేష్, రవీందర్ రెడ్డి కళ్యాణ్, సచిన్ తెలిపారు. రెండు రోజులుగా తాము ఆర్మీ బేస్ క్యాంపులోనే ఉన్నామని వెల్లడించారు. ఆర్మీ జవాన్లు తమను వారి కుటుంబ సభ్యులుగా చూసుకున్నారని తెలిపారు.