పోలీసులే గంజాయి అమ్మిస్తున్నరు: TDP ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు

పోలీసులే గంజాయి అమ్మిస్తున్నరు: TDP ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ‘రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం’ అంటూ సాక్ష్యాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు అన్న మాటలివి. ఏపీలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని.. రాష్ట్రంలో మత్తు పదార్థాల నివారణకు ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని గర్వంగా ప్రకటించారు. ఈగల్‌ మత్తు, మాదకద్రవ్యాలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుంది. ఈగల్‎కు దొరికారో చుక్కలే అన్నట్లు మాట్లాడారు చంద్రబాబు. కానీ గ్రౌండ్‎లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. మత్తు పదార్ధాలపై ఉక్కుమోదం మోపాల్సిన ఖాకీలే గంజాయి అమ్ముతున్నారు. ఇవి మేం అంటున్న మాటలు కాదు.. స్వయంగా ఏపీలో అధికారంలోకి ఉన్న కూటమి ప్రభుత్వంలోని ఓ టీడీపీ ఎమ్మెల్యే అన్న మాటలు.

పోలీసులపై టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్‌నీ ఏర్పాటు చేసి గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూల్ చేస్తున్నారని.. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు చూపిస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వ్యక్తిని గంజాయి అమ్ముతున్నావని బెదిరించి లంచం డిమాండ్ చేశాడని.. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు బంగారం తాకట్టు పెట్టి ఎస్ఐకి లక్షన్నర డబ్బులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. గంజాయి అ‍మ్మకాలకు పోలీసులే కొమ్ముకాయడం సరికాదన్నారు.

గతంలో గంజాయి కేసుల్లో అరెస్ట్ అయ్యి పాత నేరస్థులను కూడా మళ్లీ గంజాయి అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారని కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఓ వైపు మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చంద్రబాబు అంటుంటే.. మరోవైపు ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని అనడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కామెంట్స్ మరోసారి కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి. మరీ ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.