అర్ధరాత్రి మర్రిగూడ భూ నిర్వాసితుల అరెస్ట్

అర్ధరాత్రి మర్రిగూడ భూ నిర్వాసితుల అరెస్ట్

నల్లగొండ జిల్లా మర్రిగూడలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న భూ నిర్వాసితులను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండటంతో చర్లగూడెం, కిష్టరాయిన్ పల్లి రిజర్వాయర్ల భూ నిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి రెండున్నర సమయంలో అరెస్ట్ చేశారు. దీక్ష చేస్తున్న వారితో పాటు మొత్తం 80మంది భూ నిర్వాసితులను తీసుకెళ్లారు. ఐదు రోజులుగా మర్రిగూడలో భూ నిర్వాసితులు నిరాహార దీక్ష చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్రమ అరెస్టులు ఏంటని బాధితులు మండిపడుతున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరిస్తున్నారు.

చావో – రేవో తేల్చుకునేందుకు సిద్ధం

ఎన్నో ఏండ్ల నుంచి డిండి ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. మునుగోడు బై పోల్ ఉండడంతో సర్కార్ తో చావో – రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్ఎస్ లీడర్లను నిలదీద్దామని వారం రోజులుగా మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన చర్లగూడెం, వెంకే, వెంకేపెల్లి తండా, నర్సిరెడ్డి గూడెం, కిష్టరాయునిపల్లి గ్రామాల నిర్వాసితులు..మర్రిగూడ మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం నాంపల్లి, మునుగోడు మండలాల్లో పర్యటించిన మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్రిగూడ వైపు రాకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహానికి గురయ్యారు. కొందరు యువకులు అక్కడి విద్యుత్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకుంటామని హెచ్చరించారు. మంత్రి, కలెక్టర్ వచ్చే వరకూ కిందికి దిగబోమని పట్టుబట్టారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైటెన్షన్ కొనసాగింది. 

న్యాయం దక్కేది ఎప్పుడు..?

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో తాగు, సాగు నీటి కోసం 9 రిజర్వాయర్లకు సీఎం కేసీఆర్ 2015లో శంకుస్థాపన చేశారు. ఈ రిజర్వాయర్లు, కెనాల్స్ కోసం నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలో కలిపి 16 వేల 334 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 10 వేల 875 ఎకరాలు తీసుకున్నారు. ఒక్కో ఎకరాకు 4 నుంచి  5 లక్షల వరకు పరిహారం చెల్లించారు. ఇందుకోసం ఏండ్లకేండ్లు టైమ్ పట్టింది. ఈలోగా బహిరంగ మార్కెట్లో భూముల రేట్లు ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరిగింది. అనుకున్న టైమ్ లో పరిహారం ఇస్తే తాము వేరే చోట్ల భూములు కొనుగోలు చేసే వాళ్లమని, సర్కారు ఆలస్యంగా పరిహారం ఇవ్వడం వల్ల నష్టపోయామని నిర్వాసితులు అంటున్నారు. మల్లన్నసాగర్ తరహాలో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని.. లేదంటే భూమికి బదులు మరోచోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.