న్యాయం జరగాలంటే పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ ఉండాల్సిందే

న్యాయం జరగాలంటే పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ ఉండాల్సిందే

లాకప్ లో చిత్రహింసలు అనేవి మామూలు విషయంగా మారిపోయాయి. మరియమ్మ కేసుల లాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వాళ్లకు రాష్ట్రంలోని పరిస్థితులు నిరాశనే మిగిల్చాయి. పోలీసుల నుంచి వస్తున్న ఇబ్బందులను సామాన్య జనం నిశ్శబ్దంగా భరిస్తున్నారు తప్ప ఫిర్యాదు చేస్తున్న సందర్భాలు తక్కువే. అందువల్ల రాష్ట్రంలో పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. పోలీసులు తమ చర్యలకు బాధ్యత వహించేలా వీటికి అధికారాలు అప్పగించాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అథారిటీల ఏర్పాటుకు అంత సుముఖంగా లేదు. హైకోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చినా కూడా ఇంత వరకూ వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ప్రజలకు మేలు చేసే కంప్లయింట్​ అథారిటీలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అప్పుడే పోలీసులపై, న్యాయ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం కలుగుతుంది.

పో లీసులకు వ్యతిరేకంగా సామాన్యులు ఫిర్యాదు చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఫలితం ఉంటుందో లేదో తెలియదు. పోలీసులపై జనం కేసులు పెట్టడం, వారికి శిక్ష పడటం చాలా అరుదే. పోలీసులు చేసిన తప్పులకు పోలీసులను బాధ్యులను చేయడం, వారి చర్యలకు జవాబుదారీ వహించేలా చర్యలు తీసుకోవడం అనేవి ప్రజాస్వామ్య మనుగడకు అవసరం. దేశంలో ఏర్పాటు చేసిన చాలా కమిషన్లు ఈ ఆవశ్యకతను గుర్తించి పోలీసులపై ఫిర్యాదులను స్వీకరించి తగు చర్యలు తీసుకోవడానికి స్వతంత్ర అథారిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు సిఫారసు చేశాయి. కేంద్ర ప్రభుత్వం 1979లో ఏర్పాటు చేసిన జాతీయ పోలీస్ కమిషన్ తన నివేదికలో పోలీసుల మీద వచ్చే ఫిర్యాదులను విచారించడానికి స్వతంత్ర అథారిటీ ఉండాలని నొక్కి చెప్పింది. ఇదే విషయాన్ని 1992లో రెబిరో కమిటీ, 2000లో పద్మనాభయ్య కమిటీలు గుర్తుచేశాయి. ఆ తర్వాత సోలీ సొరాబ్జీ అధ్యక్షతన ఏర్పడిన పోలీస్  డ్రాఫ్టింగ్ కమిటీ.. మోడల్ పోలీస్ చట్టాన్ని తయారు చేసింది. అందులో కూడా అథారిటీల ఏర్పాటు గురించి ప్రస్తావించింది. వీళ్లందరూ పోలీస్ వ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులే. కొందరు పోలీసు అధికారులు కూడా. వాళ్లే ఈ అథారిటీల ఆవశ్యకతను గుర్తించారు.

2006లోనే ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు

ఈ సిఫార్సులను గమనించి సుప్రీంకోర్టు 2006లో ప్రకాశ్ సింగ్, ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓ కీలక తీర్పును వెలువరించింది. పోలీసు వ్యవస్థను సంస్కరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేలా ఏడు ఆదేశాలను ఈ తీర్పులో జారీ చేసింది. అందులో 6వ ఆదేశం ప్రకారం ప్రతి రాష్ట్రంలో పోలీస్ కంప్లయింట్​ అథారిటీలను ఏర్పాటు చేయాలని, స్వతంత్రంగా వ్యవహరించేలా వాటి కూర్పు ఉండాలని, పోలీసులు తమ చర్యలకు బాధ్యత వహించేలా ఈ అథారిటీలకు అధికారాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ప్రభుత్వాలు పాటించి తగు చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా చట్టాలను తీసుకొచ్చే వరకు ఈ ఆదేశాలనే శాసనంగా పరిగణించాలి. 

అథారిటీలను ఏర్పాటు చేయలె

ఇన్నేండ్లు గడిచినా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి చాలా రాష్ట్రాలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈ దిశగా అసలు సరైన చర్యలే తీసుకోలేదు. ఇక ఈ అథారిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు కూడా వాటికి సరైన అధికారాలను ఇవ్వడం లేదు. నిధులను కేటాయించడం లేదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పని చేయాలని అనుకోవడం లేదు. అందుకే వీటి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు. ఈ అథారిటీలను ఏర్పాటు చేసి, వాటి అధికారాలను ఇస్తే, తాము ఇచ్చే చట్ట వ్యతిరేక ఆదేశాలను పోలీసులు పాటించకపోవచ్చనేది ప్రభుత్వ అధినేతల భయం కావచ్చు. ఈ కారణాల వల్లే సుప్రీంకోర్టు నిర్దేశించిన పద్ధతుల్లో ఏ రాష్ట్రం కూడా పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన కొన్ని చోట్లా ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి.

పోలీస్ కంప్లయింట్ అథారిటీలు ఎందుకంటే?

ప్రభుత్వ అధికారులు ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడినా లేదా నేరాలు చేసినా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే పోలీసులే అలాంటి చర్యలకు పాల్పడితే బాధితులు మళ్లీ పోలీసుల దగ్గరికే వెళ్లాల్సిన పరిస్థితి. కానీ పోలీసుల దగ్గరకు వెళ్లి పోలీసులపైనే ఫిర్యాదు చేయాలంటే సామాన్యులకు భయం. వెళ్లినా వారికి న్యాయం జరిగే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. అలాగే పోలీసులు చిత్రహింసలకు గురిచేసినా, అక్రమంగా అరెస్టులు చేసినా, అక్రమంగా నిర్బంధించినా పై అధికారులు వాళ్లపై చర్యలు తీసుకున్న పరిస్థితి ఎక్కడా లేదు. దీని వల్ల పోలీసుల మీద విశ్వాసం తగ్గిపోయింది. మానవ హక్కుల కమిషన్ ఉన్నా కూడా దానికి అధికారాలు చాలా తక్కువ. వాటికి శిక్షించే అధికారాలు లేవు. అవి చేసేవి సిఫార్సులు మాత్రమే. వాటిని ప్రభుత్వం అంగీకరించవచ్చు.. అంగీకరించకపోవచ్చు. అందువల్ల శిక్షించే, ఫైన్లు విధించే అధికారాలు ఉన్న అథారిటీ ఆవశ్యకత ఎంతైనా ఉంది.

మన రాష్ట్రం సంగతి..

సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా స్టేట్ సెక్యూరిటీ కమిషన్​ను, పోలీస్ కంప్లయింట్ అథారిటీలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని 2017లో ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అయినా ఆ అధారిటీలను రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు. 2018 జులై 2న హైకోర్టు డివిజన్ బెంచ్ రెండు నెలల్లోగా స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్, పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆ ఉత్తర్వులను పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఎంఎస్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఏకలవ్య ఫౌండేషన్ తరఫున అప్పటి ప్రధాన న్యాయమూర్తికి ఓ లెటర్​ రాశాడు. దీని ఆధారంగా రాష్ట్ర హైకోర్టు 2019 డిసెంబర్ లో ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రెండున్నరేండ్లు దాటుతున్నా సెక్యూరిటీ కౌన్సిల్, పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయనందుకు మండిపడింది. ఈ విషయంలో ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఈ అథారిటీని డిసెంబర్ 27లోగా ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేయకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ డిసెంబర్ 30న హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయినా ప్రభుత్వంలో చలనం కనిపించలేదు. 

కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చినా..

ఈ నేపథ్యంలో 2021 జనవరి 27న అప్పటి ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులను ప్రభుత్వానికి జారీ చేసింది. 4 వారాల్లోగా వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో జూన్​లో జీవో 1093ని జారీ చేస్తూ కంప్లయింట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్ పోలీస్ కంప్లయింట్ అథారిటీని హైదరాబాద్ కేంద్రంగా, అలాగే హైదరాబాద్, వరంగల్​ రీజియన్లకు రెండు అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపింది. స్టేట్​ అథారిటీ చైర్మన్ గా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్  అబ్దుల్ పూర్కర్ ను నియమించింది. అలాగే హైదరాబాద్ రీజియన్ అథారిటీకి రిటైర్డ్ జిల్లా జడ్జి కె.సంగారెడ్డిని, వరంగల్ రీజియన్ కోసం మరో రిటైర్డ్  జిల్లా జడ్జి ఎం.వెంకటరామారావును చైర్మన్లుగా నియమించింది. ఈ జీవోను జులైలో జారీ చేసినా ఇంతవరకూ ఆ అథారిటీలు ఏర్పాటు కాలేదు. ఎందుకు ఏర్పాటు చేయలేదో రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. పరిపాలన అంటే ఎన్నికలు, ఉప ఎన్నికలు మాత్రమే కాదన్న విషయాన్ని పాలకులు ఎప్పుడు గ్రహిస్తారో.

ప్రజలకు చేరువలో ఉండాలె..

సాధ్యమైనంత త్వరగా కొత్త పోలీస్ చట్టాన్ని , అవసరమైన నిబంధనలను రూపొందించి పోలీస్ కంప్లయింట్ అథాkrటీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. వాటికి తగిన అధికారాలు ఇచ్చి అవి శక్తివంతంగా పని చేసేలా చూడాలి. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా వీటిని ఏర్పాటు చేయాలి. అలా చేసినప్పుడే  అవి ప్రజలకు అందుబాటులో ఉండి ఉపయోగపడతాయి. జిల్లా ఎస్పీపై ఫిర్యాదులను రాష్ట్ర అథారిటీ, అతని కన్నా దిగువ స్థాయి అధికారులపై ఫిర్యాదులను జిల్లా అథారిటీలు స్వీకరించి పరిష్కరించాలి. ఈ అథారిటీల్లో ఫిర్యాదు చేయడానికి బాధితులు రాష్ట్ర రాజధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమకు దగ్గరలో ఇలాంటి అథారిటీలు ఉన్నట్లయితే బాధితులు వాటిని ఆశ్రయించడానికి వీలవుతుంది. అప్పుడే రూల్ ఆఫ్ లా మీద జనాలకు విశ్వాసం ఏర్పడుతుంది.

- మంగారి రాజేందర్

రిటైర్డ్​ జిల్లా, సెషన్స్ జడ్జి