శివసేనపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుందా..?

శివసేనపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుందా..?
  • శివసేనలో అసమ్మతి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
  • తిరుగుబావుటా ఎగరేసిన శివసేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పై తిరుగుబావుటా ఎగరేయడంతో సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే.. ఈ సంక్షోభానికి బీజేపీయే కారణమన్న ఆరోపణలు, చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతున్నాయి.  ‘మహా వికాస్ అఘాఢీ’ సంకీర్ణ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభాలు కొత్తేమీ కాదు. కానీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

త కొంతకాలంగా మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన అధిష్టానం(ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే)పై అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావించిన షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అదును చూసి తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 35 మందికిపైగా ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన షిండే.. తర్వాత ఆయన అడుగులు ఎటువైపు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ పరిణామాలన్నింటీని కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాజకీయ ఉద్ధండుడైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంతంటి సంక్షోభాన్ని ముందే ఎందుకు ఊహించలేదనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

48 గంటల్లోనే రాజీనామా..

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ఏ విధమైన ‘ద్రోహాన్ని’ మరచిపోయే, క్షమించే పార్టీ కాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవిస్ 48 గంటల్లోనే రాజీనామా చేశారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో ఫడ్నవీస్ రాజీనామా అనివార్యమైంది. ఈ విషయాన్ని బీజేపీ అంత తేలికగా ఎలా వదిలిపెడుతుంది..? ‘నేను సముద్రాన్ని.. మరింత బలంగా మళ్ళీ వస్తాను’ అని బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సమయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 

2019 ఎన్నికల్లో కలిసి పోటీచేసి..

2019 ఎన్నికల్లో శివసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. BJP 106 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 56 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే.. ఎన్నికల ముందు చర్చించినట్లుగా భాగస్వామ్య పక్షాల మధ్య ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని శివసేన మెలికపెట్టింది. దీనికి బీజేపీ అంగీకరించలేదు. ఇలాంటి ఒప్పందం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేసింది. అయినా ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివసేన మొండికేసింది. దీంతో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో ఆ పార్టీల మధ్య దూరం పెరిగింది.  

శరద్ పవార్ రంగంలోకి దిగి..

2019 నవంబర్ లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కీలకపాత్ర పోషించారు. NCP, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన నిర్ణయించుకునే వరకూ అంటే దాదాపు నెల రోజుల పాటు రాజకీయ నాటకం కొనసాగింది. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి మహా వికాస్ అఘాఢీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే..ప్రభుత్వ పదవులను, అధికారాలను కోరుకోని తన తండ్రి, బాలా సాహెబ్ ఠాక్రే వలె కాకుండా ఏకంగా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠమెక్కాడు. అధికారానికి ఇంత దగ్గరగా ఉన్నా కూడా విఫలమయ్యామనే వాస్తవాన్ని  నరేంద్ర మోడీ, అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్‌లకు మింగుడు పడలేదు. ఒకప్పుడు అత్యంత నమ్మకమైన మిత్రపక్షం కూడా బీజేపీకి ద్రోహం చేసిందని భావించారు. సహజంగానే బీజేపీ, శివసేన పార్టీలు మిత్రపక్షాలు. రెండు పార్టీల సిద్దాంతాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు అది శివసైనికుల పనేనని బాలా సాహెబ్ ఠాక్రే గర్వంగా ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు.  

ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడం..

బీజేపీ, శివసేన పార్టీలు 1993 నుంచి 1998 వరకు కలిసి ప్రభుత్వాన్ని నడిపాయి. ఎప్పుడైతే బాలా సాహెబ్ థాకరే చనిపోయాడో అప్పుడే రాజకీయ పరిణామాలు కూడా నెమ్మదిగా మారిపోయాయి. 2014లో బీజేపీ తన భాగస్వామి(శివసేన) కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పుడు ఆ పార్టీకి(బీజేపీ) ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడం శివసేనకు తప్పలేదు. ఎందుకంటే ఎక్కువ సీట్లు బీజేపీ సాధించింది గనుక. ఈ వాస్తవాన్ని అంగీకరించడం ఠాక్రే కుటుంబానికి చాలా కష్టమైంది. అప్పటికే భంగపడ్డ థాకరేల ఆత్మగౌరవంపై దేవేంద్ర ఫడ్నవీస్ వర్కింగ్ స్టైల్ మరింత నిప్పు రాజేసింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీల నాయకత్వానికి భిన్నంగా నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ.. అధికారం చేజిక్కించుకోవడం కోసం శివసేనను కూడా వదిలిపెట్టదనే విషయం ముందుగానే ఆ పార్టీ(ఉద్ధవ్ ఠాక్రే) గ్రహించింది. ఊహించినట్లుగానే షిండే రూపంలో రాజకీయం సంక్షోభం తలెత్తింది. ఏక్ నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో సర్కార్ కూలిపోయే పరిస్థితి పడింది. 

శివసేనకు రాజకీయ సంక్షోభం కొత్తేమీకాదు..

గణేష్ నాయక్, ఛగన్ భుజబల్, నారాయణ్ రాణే, రాజ్ థాకరే వంటి అగ్ర నాయకులు గతంలో శివసేనను విడిచివెళ్లారు. అయితే.. ఆ పార్టీలో నిలువునా చీలికకు కారణమైన ఏక్ నాథ్ షిండేలా తిరుగుబావుటా ఎగరవేయలేదు. ప్రస్తుతం షిండే వద్ద 35మంది ఎమ్మెల్యేలకు పైగా ఉన్నారని తెలుస్తోంది. ఇది శివసేన పార్టీ పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.