ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక రాజకీయం?

V6 Velugu Posted on Oct 22, 2021

ముంబయి డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. క్రూయిజ్ షిప్‎లో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన నాటి నుంచి వాంఖడేను నవాబ్ మాలిక్ టార్గెట్ చేశారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ ఇష్యూని తెరపైకి తెచ్చిందని... సాక్షులందరూ బీజేపీ నేతలేనని ఆయన అన్నారు.

ముంబయి డ్రగ్స్ కేసులో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‎ల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే డ్రగ్స్ ఇష్యూని వాడుకుంటున్నారని ఆయన మొదట్నుంచి ఆరోపిస్తున్నారు. తాజాగా సమీర్ వాంఖడే దుబాయ్, మాల్దీవ్స్ ట్రిప్స్‎ని నవాబ్ మాలిక్ బయటపెట్టారు. కరోనా టైమ్‎లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మాల్దీవ్స్‎లోనే ఉందని... సమీర్ వాంఖడే కూడా దుబాయ్, మాల్దీవ్స్‎కి టూర్ వేశారంటూ కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. గతేడాది డిసెంబర్ 10న దుబాయ్‎లోని గ్రాండ్ హయత్ హోటల్‎లో సమీర్ వాంఖడే ఉన్నారని కొన్ని ఫొటోలు విడుదలచేశారు. అక్కడే ప్రభుత్వంపై దాడికి డీలింగ్ జరిగి ఉంటుందన్నారు. సమీర్ వాంఖడే ఓ పప్పెట్ అని... జనంపై అతను బోగస్ కేసులు పెడుతున్నారని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఏడాదిలోగా వాంఖడే జాబ్ పోతుందని ఛాలెంజ్ చేశారు. తమను జైళ్లో పెట్టడానికి వచ్చిన సమీర్ వాంఖడేను జైళ్లో పెట్టకుండా వదలబోమన్నారు.

కాగా.. నవాబ్ మాలిక్ ఆరోపణలను సమీర్ వాంఖడే ఖండించారు. గతేడాది డిసెంబర్‎లో తాను ముంబయిలోనే ఉన్నానని దుబాయ్ వెళ్లలేదన్నారు. తప్పుడు ఆరోపణలపై కచ్చితంగా దర్యాప్తు జరగాలన్నారు. తనపై ఎక్స్‎టార్షన్ పదం ఉపయోగించడాన్ని అంగీకరించేదిలేదన్నారు. తాను మాల్దీవ్స్ వెళ్లిన మాట నిజమేనని.. అయితే తాను కుటుంబంతో మాత్రమే వెళ్లినట్టు తెలిపారు. చనిపోయిన తన తల్లి, ఇతర కుటుంబసభ్యులపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవాబ్ మాలిక్‎పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని... అయితే దీనికి సీనియర్ ఆఫీసర్ల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తనను జైళ్లో పెడతానన్న మాలిక్ కామెంట్స్‎కు కౌంటర్ ఇచ్చారు. దేశానికి సేవ చేసినందుకు జైళ్లో పెడతారా..? అని ప్రశ్నించారు. 

అయితే సమీర్ వాంఖడే లీగల్ యాక్షన్ తీసుకుంటే... తాను కూడా లీగల్‎గానే వెళ్తానని నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. కచ్చితంగా సమీర్ వాంఖడేపై మాత్రం చర్యలుంటాయన్నారు. వాంఖడే దుబాయ్‎లో ఉన్నట్టు తాను టైమ్ లైన్‎తో సహా ట్విట్టర్‎లో ఫొటోలు పోస్ట్ చేసిన విషయం గుర్తు చేశారు. 

ఇకపోతే.. సమీర్ వాంఖడే దుబాయ్ ట్రిప్‎పై ఎన్సీబీ హయ్యర్ అఫీషియల్స్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్ట్ 31, 2020న వాంఖడే ఎన్సీబీలో జాయిన్ అయ్యారని... ఆ తర్వాత అతను దుబాయ్ వెళ్లేందుకు ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోలేదని తెలిపారు. ఈ ఏడాది జులైలో ఫ్యామిలీతో కలసి మాల్దీవ్స్ వెళ్లేందుకు మాత్రం అప్లికేషన్ పెట్టుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. 

For More News..

కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి

25 రోజుల్లో 18సార్లు పెరిగిన పెట్రోల్ ధర..

Tagged Mumbai, Drugs Case, drugs, Nawab Malik, aryan khan, sameer wankhede

Latest Videos

Subscribe Now

More News