ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

కమలాపూర్, వెలుగు: తమకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలమని కమలాపూర్​ మండలంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసిన పేదలు తేల్చిచెప్పారు. ఇండ్ల స్థలాలు కేటాయించాలని సుమారు 500 మంది గుడిసెలు వేసుకొని నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రతి నిరుపేదకు  గుంట భూమి, ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు అందజేయాలని డిమాండ్​చేశారు. ఆదివారం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు  జక్కు రాజుగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి నకిర్త ఓదెలు, భూరక్షణ కమిటీ అధ్యక్షులు ఎల్కటి కృష్ణ, మహేందర్ ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. 

ముగిసిన షూటింగ్​బాల్ స్టేట్​ టోర్నమెంట్

నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు కుంగిపోవద్దని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం షూటింగ్ బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో  ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతకాలంలో యువకులు ఒంటరిగా ఉంటున్నారని, చదువు ఒత్తిడితో సతమతమవుతున్నారన్నారు. క్రీడల వల్ల మానసిక ఎదుగుదల ఉంటుందన్నారు. కార్యక్రమంలో కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, తొర్రూర్ జడ్పీటీసీ శ్రీనివాస్, మండల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.         

అణగారిన వర్గాలు సీఎం పీఠంపై కూర్చోవాలి

ఆత్మకూరు (దామెర) వెలుగు:  రాష్ట్రంలో 90% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు మున్సిపాలిటీ ఉద్యోగాలు కాదని, సీఎం పీఠంపైనే కూర్చుందామని డీఎస్పీ(దళిత శక్తి ప్రోగ్రాం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆదివారం హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో చేరుకొని పదివేల కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహించాలని రెడ్డి, రావులకు అప్పచెప్పకుండా జయశంకర్ గారే తెలంగాణ ఏర్పాటు వాదానికి నాయకత్వం వహించి ఉంటే  ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ల విముక్తి కోసం పోరాటం చేస్తే జయశంకర్ మరో అంబేద్కర్ అయ్యేవారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల ఏండ్లుగా దోపిడీ చేస్తున్న 
అగ్రకులాలకు  వ్యతిరేకంగా సబ్బండ కులాల స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడానికే డీఎస్పీ ఉద్యమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ మహారాజ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాజేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్, దామెర మండలాధ్యక్షులు కిరణ్, నాగరాజు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌‌తోనే తెలంగాణ అభివృద్ధి

పర్వతగిరి(సంగెం), వెలుగు: తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్​తోనే సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్​జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో మహిళా కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన, సీసీ రోడ్లను ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందన్నారు.  రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్రం కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే  ధర్మారెడ్డి సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులు అందచేశారు. అనంతరం గుంటూరుపల్లి లో గుమ్మడి వెంకటేశ్వర్లు  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అయ్యప్ప మహాపడిపూజలో  పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, మండల రైతు కోఆర్డినేటర్​ నరహరి, వివిధ గ్రామాల సర్పంచులు, 
ఎంపీటీసీలు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ పతనం ఖాయం

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ పతనం కావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర అన్నారు.  టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాక తొలిసారిగా ఆదివారం స్టేషన్​ఘన్​పూర్​లో ఆమె పర్యటించారు. కాంగ్రెస్​ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్​కు తెలంగాణతో బంధం విడిపోయిందని, బీఆర్ఎస్​ పేరుతో దేశాన్ని ఏం ఉద్దరిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ డైరెక్టర్​ చింత ఎల్లయ్య, మహిళా కాంగ్రెస్​ మండల అధ్యక్షురాలు జ్యోత్స్న,  లీడర్లు నాగయ్య, రాజ్​కుమార్​ పాల్గొన్నారు

ఘనంగా అయ్యప్ప పడిపూజ

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ లోని ఉర్సు నాగేంద్రస్వామి ఆలయం వద్ద ఆదివారం అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​ హాజరై భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, భక్తులు పాల్గొన్నారు. పోచమ్మమైదాన్​ సెంటర్​లోని మసీద్​ను ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నరేందర్​ సందర్శించారు. అనంత రం జమాతే అహలే హదీస్​ జామా మసీద్​ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఖురాన్​ అందజేశారు. కార్యక్రమంలో మసీద్​ కమిటీ సభ్యులు అబ్దుల్​ రషీద్, అబ్దుల్ సత్తార్, ముస్లింలు, టీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు. 

విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ములుగు, గోవిందరావుపేట, వెలుగు: ములుగు జిల్లా  గోవిందరావుపేట  మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్న హిందూ దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు  చింతలపూడి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది దుండగులు ఉద్దేశపూర్వకంగానే  షెడ్ ని కూల్చివేసి విగ్రహాలని రోడ్డుపైన పడేయడం దుర్మార్గమన్నారు. అనంతరం గోవిందరావుపేట మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు పస్రా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.