చికాగోలో కిమ్స్ డాక్టర్ల సత్తా ...40 ఏండ్లలో తొలిసారిగా భారత్‌‌‌‌ కు స్వర్ణం

చికాగోలో కిమ్స్ డాక్టర్ల సత్తా ...40 ఏండ్లలో తొలిసారిగా భారత్‌‌‌‌  కు స్వర్ణం

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ రుమటాలజీ వేదికపై భారత వైద్యులు చరిత్ర సృష్టించారు. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రతిష్టాత్మక అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ (ఏసీఆర్) నాలెడ్జ్ బౌల్-2025 పోటీల్లో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం ‘కార్ టైటాన్స్’ స్వర్ణ పతకం సాధించి, 40 ఏండ్లలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జట్టుగా నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేయో క్లినిక్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వంటి అగ్రశ్రేణి సంస్థలతో పోటీపడి విజేతగా నిలవడమే కాకుండా, టీమ్ స్పిరిట్ అవార్డును కూడా కైవసం చేసుకుంది.

 కిమ్స్ హాస్పిటల్ రుమటాలజీ హెచ్​వోడీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, డాక్టర్ మోహిత్, పుదుచ్చేరి జిప్‌‌‌‌ మర్‌‌‌‌ కు చెందిన డాక్టర్ రితేశ్​తో కూడిన ఈ బృందం, అత్యంత క్లిష్టమైన పోటీలో అసాధారణ ప్రతిభ కనబరిచి రుమటాలజీ, ఇమ్యునాలజీ రంగాల్లో తమకున్న లోతైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించింది. ఈ చారిత్రాత్మక విజయం భారతీయ రుమటాలజీ రంగానికి దక్కిన అరుదైన గౌరవమని, ఇది దేశంలోని భావి వైద్యులకు స్ఫూర్తిగా నిలుస్తుందని డాక్టర్ శరత్ చంద్రమౌళి పేర్కొన్నారు.