సర్కారు మాటలతో హైదరాబాద్​ చుట్టూ భూముల ధరలకు రెక్కలు

సర్కారు మాటలతో హైదరాబాద్​ చుట్టూ భూముల ధరలకు రెక్కలు
  • సామాన్యుడు గజం కొనాలన్నా గగనమే 
  • ఆ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు అంటూ హామీలిచ్చి వదిలేస్తున్న ప్రభుత్వం
  • వాటిని మార్కెటింగ్​కు ఉపయోగించుకుంటున్న వ్యాపారులు
  • మెట్రో, ఎంఎంటీఎస్, ట్రిపుల్ ఆర్, స్కైవేలు, ఎలివేటెడ్​ కారిడార్ల పేరిట భారీ భూ దందా

హైదరాబాద్, వెలుగు: ఓ ఐదేండ్లు, పదేండ్ల తర్వాత కూడా అమలవుతాయో, లేదో కూడా నమ్మకం లేని ప్రభుత్వ హామీలతో హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. సామాన్యుడు గజం జాగా కొనుక్కోవాలన్నా గగనమవుతున్నది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పేరిట గ్రేటర్ చుట్టు పక్కల భూముల రేట్లు భారీగా పెరిగిపోయాయి. రైతుల చేతుల్లో నుంచి భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లి.. ప్లాట్లుగా మారాయి. రెండు రోజుల కింద ఎయిర్‌‌‌‌పోర్ట్ మెట్రోకు సీఎం కేసీఆర్‌‌‌‌ శంకుస్థాపన చేస్తూ.. ఔటర్​ రింగ్​ రోడ్డు (ఓఆర్‌‌‌‌ఆర్​)‌‌ చుట్టూ మెట్రో నిర్మిస్తామని, సిటీలోని అన్ని ప్రాంతాలనూ మెట్రోతో కనెక్ట్‌‌ చేస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా ఇవన్నీ చేసి తీరుతామన్నారు. కేసీఆర్‌‌‌‌ చెప్పిన ఆ మాటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందిపుచ్చుకున్నారు. తమకు అలవాటైన పద్ధతిలో.. కేసీఆర్ మాట్లాడిన వీడియోను ఏజెంట్ల ద్వారా ట్రెండింగ్‌‌లో ఉండేలా చూస్తున్నారు. అప్పుడే ఓఆర్‌‌‌‌ఆర్ చుట్టూ మెట్రో అయినట్టు త్రీడీ వీడియోలు సిద్ధం చేసి జనాల్లోకి వదులుతున్నారు. ఈ తరహా హామీలు, ప్రచారంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వస్తున్నాయి.

మధ్యతరగతి ఆశలపై నీళ్లు

అరచేతిలో వైకుంఠం చూపించినట్టు, ప్రభుత్వం ఇచ్చే హామీలను గ్రాఫిక్స్‌‌‌‌లో చూపించి రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు ప్లాట్ల రేట్లు అడ్డగోలుగా పెంచుతున్నారు. ఓ ఐదేండ్ల తర్వాత ఉండాల్సిన రేటుకు ఇప్పుడు ప్లాట్లు అమ్ముతున్నారు. ఇందుకోసం జనాలను ఆకట్టుకునేలా భారీ ఎత్తున మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు, వ్యాపారుల మార్కెటింగ్ హడావుడి చూసి.. ధనికులు ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుతుందన్న ఆశతో ఎక్కువ రేట్లు పెట్టి కూడా ఈ ప్లాట్లను కొంటున్నారు. దీన్ని  ఓ పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. నగరంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్న మధ్య తరగతి జనాలు ఆ భారీ ధరలు పెట్టి ప్లాట్లను, ఫ్లాట్లను కొనలేకపోతున్నారు. ఔటర్ రింగ్‌‌‌‌ రోడ్డుకు నాలుగైదు కిలో మీటర్ల అవతల ప్రస్తుతం తక్కువలో తక్కువ ప్లాట్ల రేటు చదరపు గజానికి రూ. 10 వేల దాకా ఉంది.

ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 147 గజాల జాగా ఉండాలి. ఈ లెక్కన మినిమమ్ ధరతో (రూ.10 వేలు) 147 గజాల ప్లాటు కొనాలంటే 14.70 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. రిజిస్ర్టేషన్, పర్మిషన్లకు ఇంకో మూడు నాలుగు లక్షల ఖర్చవుతుంది. హెచ్‌‌‌‌ఎండీఏ లిమిట్స్‌‌‌‌లో తక్కువలో తక్కువ చదరపు గజానికి రూ. 18 వేలకుపైగానే ఉంది. రిజిస్ట్రేషన్, పర్మిషన్ చార్జీలు అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయలేక ఇండిపెండెంట్‌‌‌‌ హౌస్​ జోలికి జనాలు వెళ్లడం లేదు. కనీసం అపార్ట్‌‌‌‌మెంట్లలో ప్లాట్లు కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నా.. ఇక్కడ కూడా ధరలు భగ్గుమంటున్నాయి. హెచ్​ఎండీఏ ​ పరిధిలో డబుల్ బెడ్రూం కొనాలంటే రూ.50 లక్షలకుపైనే ఖర్చవుతున్నది. సిటీ శివారు ప్రాంతాల్లో రూ.35 లక్షల వరకూ కనీస ధర ఉంది. 

లీకులు ఇచ్చి వదిలేసుడు..!

గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ చుట్టూ రియల్ ఎస్టేట్ బూమ్​ను పెంచే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కార్ హామీలు ఇస్తున్నది. కానీ, ఆ హామీలు నెరవేరడం లేదు. సర్కారు హామీతో వ్యాపారులు అక్కడి భూములకు భారీగా రేట్లు పెట్టి అమ్మకానికి పెడుతున్నారు. వాటిని కొన్నవాళ్లు.. ఎప్పుడు సర్కారు హామీ నెరవేరుతుందా? తమ భూములకు ఇంకింత ఎక్కువ రేటు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. గచ్చిబౌలి, హైటెక్‌‌‌‌సిటీ ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌లో మోనో రైల్ అందుబాటులోకి తీసుకొస్తామని గతంలో  సర్కార్ లీకులు ఇచ్చింది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది.

శ్రీశైలం హైవే ఫ్యాబ్ సిటీ పత్తా లేకుండా పోయింది. ఇలాంటి ఎన్నో హామీలు నగరంలో భూములు, ప్లాట్ల ధరల పెంపునకు కారణమవుతున్నాయి. రాష్ట్ర సర్కారు హామీలు రియల్​ ఎస్టేట్​ వ్యాపారం కోసమేనన్నట్లుగా ఉంటున్నాయని, అవి నెరవేరడం లేదని భారీ ధరలకు భూములు కొన్నోళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సర్కార్ ఇచ్చే భారీ ప్రాజెక్టుల హామీల వల్ల నగరంలోని సామాన్య జనం నష్టపోతున్నారు. కూడబెట్టుకున్న పైసలకు నగర శివారులు గజం జాగా కూడా కొనే 
పరిస్థితి లేదు.

అట్ల సర్కారు చెప్పుడే ఆలస్యం!    

అనంతగిరిని తెలంగాణ ఊటీగా డెవలప్‌‌‌‌ చేస్తామన్న కేసీఆర్ మాటలతో అక్కడి భూముల ధరలు పెరిగాయి. కానీ, అక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. కూకట్‌‌‌‌పల్లి నుంచి నానక్‌‌‌‌ రామ్‌‌‌‌గూడ వరకు 22 కి.మీ. నియో మెట్రో(ఎలివేటెడ్‌‌‌‌ బస్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ ట్రాన్సిట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌) ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ రెండేండ్ల కిందట ప్రకటించారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు దిక్కు లేదు. కానీ, అక్కడ భూముల రేట్లకు మాత్రం రెక్కలు వచ్చాయి. 

ప్రభుత్వ హామీలే ఊతం

జరిగిన అభివృద్ధి కంటే, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలపైనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా ఆధారపడుతుంది. ప్రభుత్వం హామీ ఇచ్చే ప్రాజెక్టులు ఎప్పటికైనా నెరవేరుతాయన్న నమ్మకం అందరికీ ఉంటుంది. ప్రాజెక్టు పూర్తవగానే రేట్లు భారీగా పెరుగుతాయని అంచనాకు వస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అదే నమ్మకంతో వెంచర్లు స్టార్ట్ చేసి, ధర నిర్ణయిస్తారు. రేట్లు పెరిగిన తర్వాత అమ్ముకుందామన్న ఆశతో, డబ్బులు ఉన్న వాళ్లు ఈ ప్లాట్లపై పెట్టుబడి పెడుతారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్న ధరకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే ప్లాట్లు కొనేముందే ఆలోచించాలి. - రామ్‌‌‌‌, రియల్ ఎస్టేట్ అడ్వైజర్, హైదరాబాద్

అట్ల సర్కారు చెప్పుడే ఆలస్యం..! 

ఉప్పల్ నుంచి ఘట్‌‌కేసర్, జేబీఎస్ నుంచి శామీర్‌‌‌‌పేట్, కొంపల్లి నుంచి ప్యారడైజ్ వరకూ స్కైవేలు నిర్మిస్తామని ఏడేండ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అట్లా సర్కారు ప్రకటించుడే ఆలస్యం.. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలను వ్యాపారులు భారీగా పెంచి అమ్మేశారు. కానీ, ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదు. సికింద్రాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకూ ఎంఎంటీఎస్  రైల్వే లైన్ వేస్తామని కొన్నేండ్ల కింద ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే అదునుగా వ్యాపారులు.. ఎంఎంటీఎస్‌‌  రైలు బొమ్మలు పెట్టి యాదాద్రి చుట్టు పక్కల భూములన్నీ రియల్ ఎస్టేట్‌‌ వెంచర్లుగా మార్చి భారీ ధరలకు అమ్మేశారు. అప్పుడు భారీ ధరలు పెట్టి కొన్నోళ్లకు వడ్డీ మందం కూడా ధర పెరగలేదు. ఎయిర్‌‌‌‌పోర్ట్ వరకూ ఎంఎంటీఎస్‌‌ విస్తరణ హామీ కూడా అమలు కాలేదు. ఆ హామీని చూసి భూములు కొన్నోళ్లు పరేషాన్​ అవుతున్నారు.