
- మున్సిపాలిటీల నుంచి వసూలు చేసి కడ్తున్న సర్కార్
- ఇప్పటికే రూ. 1,457 కోట్ల చెల్లింపులు.. మిగతావి కిస్తీల్లో..
- గత మార్చి నెల వరకు పంచాయతీల్లోనూ వసూలు
హైదరాబాద్, వెలుగు : మిషన్ భగీరథ కింద ఫ్రీగా మంచినీళ్లు ఇచ్చుడు ఉత్తి ముచ్చటే అవుతున్నది. అన్ని మున్సిపాలిటీల నుంచి పన్నుల రూపంలో సమకూరిన మొత్తాన్ని మిషన్ భగీరథ ( తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్)కు ప్రభుత్వం కడుతున్నది. మిషన్ భగీరథ మొదలైనప్పటి నుంచి జూన్ 2022 నాటికి రూ. 1,457 కోట్లు మున్సిపాలిటీల నుంచి కట్టాలని సీడీఎంఏ కమిషనర్‌కు కార్పొరేషన్ ఈఎన్సీ లెటర్ రాశారు. దీంతో మున్సిపాలిటీల్లో అందించిన మంచినీళ్లకే ఇప్పటి వరకు సీడీఎంఏ నుంచి ఆ మొత్తం చెల్లింపులు జరిగాయి. మిగతా బకాయిలు (జులై నెల తర్వాతవి) కూడా త్వరలోనే తీరుస్తామని, ఇక మీదట ప్రతినెలా కిస్తీల పద్ధతిలో మిషన్ భగీరథ నీళ్లకు డబ్బు జమ చేస్తామని తెలిపింది. ఈ ఏడాది మార్చి వరకు గ్రామపంచాయతీల్లోనూ పన్నులు వసూలు చేసి, వాటిని కార్పొరేషన్‌కు జమచేశారు. ‘‘ఇంటింటికీ ఉచితంగా మంచినీటిని అందిస్తాం.. అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది” అని ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు ప్రకటించినప్పటికీ.. మున్సిపాలిటీల నుంచి వసూలు చేసి కడుతుండటంతో ఆ భారం ప్రజలపై పడుతున్నది.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు వాటర్ సప్లయ్ చేసినందుకు ఈ ఏడాది జూన్ వరకు రూ.1,457.49 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని ప్రభుత్వానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సీడీఎంఏ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు మొత్తం చెల్లింపులు కార్పొరేషన్ ఖాతాలో పడ్డాయి. ప్రతి మున్సిపాలిటీలో నల్లా బిల్లులు, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ కు జమ చేసింది. కొంత మొత్తం తక్కువ పడితే.. డిపార్ట్మెంట్ నిధుల నుంచి సర్దినట్లు ఉన్నతాధికారిక ఒకరు తెలిపారు. మిషన్ భగీరథ నీటికోసం ఒక్కో మున్సిపాలిటీ నుంచి యావరేజ్‌గా రూ. 12.50 కోట్లు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇక ప్రతి ఏడాది మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ మంచినీటి కోసం రూ.400 కోట్ల దాకా పన్నుల రూపంలో వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
77 శాతం అప్పులే!
మిషన్ భగీరథ కోసం చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి నిధుల సర్దుబాటు కాకపోవడంతోనే పన్నులపై ఆధారపడుతున్నట్లు చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఇప్పటికీ ఇంకా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. అనేక చోట్ల కనెక్షన్లు ఇచ్చి కొన్ని చోట్ల నల్లాలు బిగించకపోగా.. మరికొన్ని చోట్ల ఇంకా మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనులు అసంపూర్తిగా ఉండగా, వాటిని పూర్తి చేస్తున్నారు. చాలా గ్రామాల్లోనూ వివిధ రకాల పనులు మిగిలిపోయాయి. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని కంప్లయింట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ స్కీం కోసం రూ.30,473 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులోనూ 77 శాతం అప్పులు ఉన్నాయి.