డల్లాస్, ఇస్తాంబుల్ రోడ్లు ఎక్కడ?..అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు

డల్లాస్, ఇస్తాంబుల్ రోడ్లు ఎక్కడ?..అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు
  • ఏండ్లుగా సిటీలో మారని రోడ్లు
  •  విదేశీ తరహాలో వేస్తామని చెప్పి పట్టించుకోలే
  • సీఆర్ఎంపీ మినహాఅంతటా డ్యామేజ్
  • రిపేర్లు కూడా సరిగా చేస్తలేరు
  • రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల ఊసే ఎత్తట్లేదు

“ లండన్, అమెరికా తరహాలో హైదరాబాద్​లో రోడ్లను వేస్తం. ఇస్తాంబుల్ మాదిరిగా ఓల్డ్ సిటీని తీర్చిదిద్దుతం.” ఇదీ 2014 అక్టోబర్ 31న గ్రేటర్ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ.  “ వందశాతం అమెరికాలోని డల్లాస్ మాదిరిగా సిటీని చూడబోతున్నాం’’. అంటూ.. 2015 జనవరి1న మరోసారి  సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్, వెలుగు : సిటీని అమెరికాలోని డల్లాస్, ఇస్తాంబుల్ లెక్కనే చేస్తామని, అక్కడ రోడ్లు ఉన్నట్లుగానే... మన దగ్గర కూడా వేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించినా ఇప్పటికీ నెరవేరలేదు. రోడ్లు మరింత డ్యామేజ్ అయి గుంతులు పడినా పూడ్చలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి సిటీలో రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్ల రిపేర్లను మరిచిపోయారు. కొత్త రోడ్లనిర్మాణం ఊసేలేదు. గ్రేటర్​లో మొత్తం  9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా.. ఇందులో 68.42 శాతం సీసీ రోడ్లు (6,167 కి.మీ), 31.58 శాతం బీటీ రోడ్లు  (2,846  కి.మీ) ఉన్నాయి.

ప్రతిఏటా రోడ్లకు నిధులు మంజూరైనా బల్దియా పనులు చేయకుండా నిర్లక్ష్యం చూపుతున్నది. గతేడాది  రూ.1,274 కోట్లతో 4, 790 రోడ్ల  పనులు చేపట్టారు. అందులో రూ.697 కోట్లతో  2,450  పనులు మాత్రమే పూర్తి చేసింది.ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.567 కోట్లతో  2,162 పనులు మంజూరు చేశారు. ఇప్పటివరకు వందలోపు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. దీంతో సిటీలో చాలా చోట్ల రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వాహనదారులు సాఫీగా ప్రయాణించలేకపోతున్నారు. ఒక్క సీఆర్ఎంపీ రోడ్లు తప్ప మిగతారోడ్లన్నీ కరాబ్​గానే ఉన్నాయి. 

ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ లేదు 

గ్రేటర్​లో రోడ్ల విస్తరణ లేదు. కొత్త రోడ్ల పనులు చేయడం లేదు. ఓల్డ్ సిటీలో13 రోడ్లకు సంబంధించి కొన్నేళ్లుగా విస్తరణ పెండింగ్​లోనే ఉంది.  ఆస్తుల సేకరణకు ఫండ్స్ ​లేక పనులు నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ 2 నెలల కిందట ఆస్తుల సేకరణకు రూ.150  కోట్లు హెచ్ఎండీఏ నుంచి మంజూరు చేయించారు. ఎన్నికల ముందు రోడ్ల  వైడెనింగ్ పనులను పక్కన పెట్టేశారు. కాగా ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ అధికారులకు పెద్ద సవాల్​గా మారింది. రోడ్ల విస్తరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది.

ఇదిలా ఉంటే రోడ్లు పూర్తిగా పాడైన చోట రీ కార్పెటింగ్ చేసేందుకు ఫండ్స్​ లేక పనులు చేపట్టడం లేదు. దీంతో మంజూరైన పనులూ కొనసాగించడం లేదు. వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు చాలాచోట్ల రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వాటిపై గ్రీవెన్స్​సెల్ అధికారులతో మాట్లాడితే ఆయా ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు వేసేందుకు పనులు శాంక్షన్ అయ్యాయని నిధులు రాగానే చేపడతామని జవాబు ఇస్తున్నారు. మొత్తానికి బల్దియా పనితీరు ఇలా ఉంది. 

క్వాలిటీగా లేని రోడ్లు 

సిటీలో వేస్తున్న రోడ్లు కూడా నాణ్యతగా ఉండటంలేదు.  రోడ్ల క్వాలిటీ కంట్రోల్​పై  కూడా అధికారులు దృష్టి పెట్టకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వేస్తున్నారు. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా నాణ్యత పాటించడంలో బల్దియా విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్​లో వేసే రోడ్లను చూస్తే ఇదే స్పష్టమైతుంది.

బీటీ, సీసీ రోడ్లు వేసిన కొన్నాళ్లకే గుంతలు పడుతున్నాయి. ఇందుకు బాధ్యత క్వాలిటీ కంట్రోల్ విభాగంపైనే ఉంది. నెల, రెండు నెలల కింద రిపేర్లు చేసిన  చాలా  ప్రాంతాల్లో ఇదే సమస్య నెలకొందని స్థానిక జనం మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలోనూ వైరల్ 

ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలపై పాడైన రోడ్లతో ఆడియో, వీడియోలను మిక్స్ ​చేసి సోషల్​మీడియాలో జనం వైరల్ చేస్తున్నారు. డల్లాస్, ఇస్తాంబుల్ ​సిటీల తరహాలో ఇక్కడ కూడా రోడ్లు వేస్తామని చెప్పిన మాటలు ఎక్కువగా ట్రోల్​అవుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఫేస్​బుక్, ఎక్స్ (ట్విట్టర్) తదితర సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేస్తున్నారు.

తండ్రీ కొడుకులు మాటలు చెబుతున్నారే తప్ప పనులు మాత్రం చేయడం లేదని ఫైర్ అవుతున్నారు. హామీలు ఇచ్చేముందు సాధ్యం అవుతుందా..? లేదా అన్నది ఆలోచించాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా ఏవో మాటలు చెప్పి​ఆ తర్వాత పనులు  చేయకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మాటలు చెప్పకుండా పనులు చేయాలని కోరుతున్నారు.