వివాదాస్పదంగా మారిన ప్రొటోకాల్​

వివాదాస్పదంగా మారిన ప్రొటోకాల్​

ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్  లీడర్ల మధ్య రచ్చ మొదలైంది. అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ సోయం బాపూరావును పిలవడం లేదంటూ బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు. జైనథ్ మండలంలోని కంఠ  గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.1.50 కోట్లతో మంజూరైన రోడ్డును మంగళవారం ఎంపీ  సోయం బాపూరావు ప్రారంభించారు. ఇదే రోడ్డుకు వారం క్రితం ఎమ్మెల్యే జోగు రామన్న భూమిపూజ చేశారు. గ్రామాల్లోని అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయని, ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదంటూ ఎంపీ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధిపై కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు.

ప్రొటోకాల్ రగడ...

కొన్ని రోజులుగా జిల్లాలో ప్రొటోకాల్ రగడ కొనసాగుతోంది. గతంలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం సమయంలో ఎంపీకి ఆహ్వానం అందకపోవడం తీవ్ర దుమారం లేపింది. దీంతో అధికారులు ప్రకటించిన రోజు ప్రారంభోత్సవం ఆగిపోయింది. కొన్నిరోజుల తర్వాత మంత్రి హరీశ్​రావును ఆహ్వానించి సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్​ను​ ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఎంపీ హాజరుకాలేదు. 

సీఎం బాటలో ఎమ్మెల్యే నడుస్తుండు...

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: సీఎం కేసీఆర్ లాగనే ఎమ్మెల్యే జోగురామన్న ప్రొటోకాల్ పాటించడం లేదని ఎంపీ సోయం బాపూరావు ఫైర్​అయ్యారు. కంఠ గ్రామంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద మంజూరైన సీసీ రోడ్డు పనులను మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​తో కలిసి ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రొటోకాల్​మరిచి గవర్నర్ ను కించపరిచే విధంగా ప్రవర్తిస్తుంటే.. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎంపీని ఆహ్వానించకుండా కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన రోడ్డును బీఆర్ఎస్​ లీడర్లు భూమి పూజ చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎంపీయే ప్రారంభిస్తారని తెలిపారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, లీడర్లు చంద్రకాంత్, రాందాస్, సుభాష్, దయాలాల్, దిలీప్, దయాకర్, గోవర్దన్, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వివాదాస్పదంగా మారిన ప్రొటోకాల్​

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రొటోకాల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్​ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, లీడర్లు అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదంటూ కాంగ్రెస్​ పార్టీ లీడర్లు ఆందోళన బాటపట్టారు. మంగళవారం సోన్ ఎంపీపీ బర్ల మానస హరీశ్​ రెడ్డి, సర్పంచ్ మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు హరీశ్ రెడ్డి, జమాల్, మార గంగారెడ్డి, నాందేడపు చిన్ను తదితరులు  కలెక్టర్ కు  ఫిర్యాదు  చేశారు. సోన్ మండలం సిద్దిలకుంట గ్రామంలో జరిగిన సిద్దేశ్వర ఆలయ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్పంచ్​ను ప్రత్యేక అతిథిగా పేర్కొంటూ శిలాఫలకంలో పేరు రాశారని, ఎంపీపీని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గతంలో కూడా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రొటోకాల్ ను విస్మరించారని మండిపడ్డారు. ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.