టైటాన్స్​కు చెక్​

టైటాన్స్​కు చెక్​

ధవన్​ హాఫ్​ సెంచరీ
గుజరాత్‌‌పై పంజాబ్‌‌ గెలుపు
రాణించిన రబాడ, రాజపక్స, లివింగ్‌‌స్టోన్‌‌
సాయి సుదర్శన్‌‌ శ్రమ వృథా

నవీ ముంబై : ప్లే ఆఫ్స్‌‌కు టైమ్‌‌ దగ్గరపడుతున్న వేళ.. ఐపీఎల్‌‌లో ఒక్కో టీమ్‌‌ జూలు విదిలుస్తున్నాయి. గత నాలుగు మ్యాచ్​ల్లో మూడు ఓటములతో డీలా పడ్డ పంజాబ్‌‌ కింగ్స్‌‌.. సరైన టైమ్‌‌లో మళ్లీ గాడిలో పడింది. వరుసగా ఐదు విజయాలతో  టాప్​ గేర్​లో దూసుకెళ్తున్న గుజరాత్​ టైటాన్స్​కు చెక్​ పెట్టింది.  సూపర్​  బౌలింగ్​కు తోడు​ శిఖర్‌‌ ధవన్‌‌ (53 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 62 నాటౌట్‌‌), లివింగ్‌‌స్టోన్‌‌ (10 బాల్స్‌‌లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 30 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ 8 వికెట్ల తేడాతో టైటాన్స్‌‌కు షాకిచ్చింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న గుజరాత్‌‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌‌ (50 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 64 నాటౌట్‌‌) హాఫ్‌‌ సెంచరీతో మెరవగా, పంజాబ్‌‌ పేసర్‌‌ రబాడ (4/33) ముందు మిగతా వారు తేలిపోయారు. తర్వాత పంజాబ్‌‌ 16 ఓవర్లలో 145/2 స్కోరు చేసి నెగ్గింది. ధవన్‌‌కు తోడుగా భానుక రాజపక్స (28 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 40) రాణించాడు. రబాడకు‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది. 

రఫ్పాడించిన రబాడ..
తొలి రెండు ఓవర్లలోనే నాలుగు ఫోర్లతో మంచి జోష్‌‌లో కనిపించిన గుజరాత్‌‌ ఇన్నింగ్స్‌‌ను రబాడ దెబ్బకొట్టాడు. కీలక వికెట్లు తీసి స్కోరు బోర్డుకు కళ్లెం వేశాడు. మూడో ఓవర్‌‌లో గిల్‌‌ (9) రనౌట్‌‌ కాగా, రబాడ (4వ ఓవర్‌‌) బౌలింగ్‌‌లో భారీ సిక్సర్‌‌ కొట్టిన సాహా (21) తర్వాతి బాల్‌‌కే  వెనుదిరిగాడు. ఈ దశలో సాయి సుదర్శన్‌‌ ఓ ఎండ్‌‌లో పాతుకుపోయినా.. రెండో ఎండ్‌‌లో గుజరాత్‌‌ వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. పవర్‌‌ప్లేలో 42/2 స్కోరు చేసిన జీటీకి ఏడో ఓవర్‌‌లో హార్దిక్‌‌ పాండ్యా (1) ఔట్‌‌ రూపంలో భారీ దెబ్బ తగిలింది. దీంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో గుజరాత్‌‌ స్కోరు 62/3 మాత్రమే. 12వ ఓవర్‌‌లో మిల్లర్‌‌ (11) వెనుదిరగడం, రాహుల్‌‌ తెవాటియా (11)ను భారీ షాట్లు కొట్టకుండా బౌలర్లు కట్టడి చేయడంతో గుజరాత్‌‌ కష్టాలు రెట్టింపయ్యాయి. ఫలితంగా 11 నుంచి 16 ఓవర్ల మధ్య కేవలం 46 రన్సే వచ్చాయి. దీనికితోడు 17వ ఓవర్‌‌లో రబాడ.. వరుస బాల్స్‌‌లో తెవాటియా, రషీద్‌‌ (0)ను ఔట్‌‌ చేయడంతో రన్‌‌రేట్‌‌ మందగించింది. ఈ క్రమంలో 18వ ఓవర్‌‌లో అర్షదీప్‌‌ బాల్‌‌ను సిక్సర్‌‌గా మలిచి 42 బాల్స్‌‌లో సుదర్శన్‌‌ హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. కానీ ఇదే ఓవర్‌‌లో ప్రదీప్‌‌ సంగ్వాన్‌‌ (2) వెనుదిరిగాడు. 19వ ఓవర్‌‌ (రబాడ)లో ఫెర్గుసన్‌‌ (5) వికెట్‌‌ పడటంతో గుజరాత్‌‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. అర్షదీప్‌‌, లివింగ్‌‌స్టోన్‌‌, రిషీ ధవన్‌‌ తలా ఓ వికెట్‌‌ తీశారు. 


కింగ్స్​ అలవోకగా..
చిన్న టార్గెట్‌‌ను పంజాబ్‌‌  అలవోకగా ఛేదించింది. సెకండ్‌‌ ఓవర్‌‌లో ధవన్‌‌ రెండు ఫోర్లలో టచ్‌‌లోకి వస్తే, తర్వాతి ఓవర్‌‌లో బెయిర్‌‌స్టో (1)ను షమీ బోల్తా కొట్టించాడు. 10/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన రాజపక్స.. ధవన్‌‌కు అండగా నిలిచాడు. రెండు ఫోర్లతో క్రీజులో కుదురుకున్నాడు. నాలుగో ఓవర్‌‌లో ధవన్‌‌ వరుసగా 6, 4తో 12 రన్స్‌‌ రాబట్టాడు. తర్వాత మరో రెండు ఫోర్లు బాదడంతో పవర్‌‌ప్లేలో పంజాబ్‌‌ 43/1 స్కోరుతో నిలిచింది. ఏడో ఓవర్‌‌లో రాజపక్స రెండు, ధవన్‌‌ ఫోర్‌‌ కొట్టడంతో 15 రన్స్‌‌ వచ్చాయి. రషీద్‌‌ బౌలింగ్‌‌లో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరు సింగిల్స్‌‌తోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా ఫస్ట్‌‌ టెన్‌‌లో పంజాబ్‌‌ 76/1 స్కోరు సాధించింది. 12వ ఓవర్‌‌లో ఫోర్‌‌తో ధవన్‌‌ 38 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, ఆ వెంటనే సిక్సర్‌‌ కొట్టిన రాజపక్స లాస్ట్‌‌బాల్‌‌కు ఔటయ్యాడు. ఫలితంగా రెండో వికెట్‌‌కు 87 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. లివింగ్‌‌స్టోన్‌‌  స్టార్టింగ్‌‌లో నిలకడ చూపడంతో 15 ఓవర్లకు పంజాబ్‌‌ 117/2 స్కోరుతో విజయం దిశగా దూసుకెళ్లింది. ఇక 30 బాల్స్‌‌లో 27 రన్స్‌‌ కావాల్సిన దశలో లివింగ్‌‌స్టోన్‌‌ ఒక్కసారిగా విశ్వరూపం చూపెట్టాడు. షమీ వేసిన 16వ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4, 2, 4తో పంజాబ్​కు విజయం సాధించిపెట్టాడు.