- పత్తిలో తగ్గని తేమ, ఎండని వడ్లు, ఆరని మక్కలు
- పత్తిలో 12 శాతం మించితే కొనేదిలేదంటున్న సీసీఐ
- ఇదే అదనుగా అగ్గువకు కొంటున్న వ్యాపారులు
- వడ్లలో 17 శాతమే అనుమతిస్తున్న సివిల్ సప్లయ్స్
- మొక్కజొన్న ఆరక ధర పలుకుత లేదు
- తేమ పేరిట కొర్రీలు పెట్టడంపై ఆదిలాబాద్లో రైతుల ధర్నా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో పత్తి, వడ్లు, మొక్కజొన్న దిగుబడుల్లో తేమ శాతం పెరిగి పంటలను అమ్ముకోలేక రైతులు పరేషాన్ అవుతున్నారు. తాజాగా ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. తేమ శాతం(మాయిశ్చర్) పేరుతో కొర్రీలు పెట్టడంపై సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మార్కెట్యార్డ్లోనే ధర్నాకు దిగారు.
వానలతో ఆగిన పంట కోతలు
రాష్ట్రంలో నిత్యం కురుస్తున్న వర్షాలు పత్తి, వడ్లు, మొక్కజొన్న పంటలను దెబ్బతీస్తున్నాయి. పత్తి కాయలు దెబ్బతింటుండడంతో పాటు ఇప్పటికే ఏరిన పత్తికి తేమ సమస్యగా మారింది. కూలీలను పెట్టి పత్తి ఏరించి ఇంటికి తీసుకొచ్చినా అది మార్కెట్‌కు తీసుకువెళ్లే పరిస్థితి లేదు. తేమ ఉన్న పత్తిని వ్యాపారులు చాలా తక్కువకు కొని రైతులను దోచుకుంటున్నారు. దీంతో కొందరు రైతులు ఇండ్లలో ఫ్యాన్లు పెట్టి మరీ ఆరబెడుతున్నారు. మరోవైపు వానల ప్రభావంతో వరి చేన్లు నేల వాలుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలకు భయపడి రైతు వరి కోతలు వాయిదా వేస్తున్నారు. పంట కోస్తే వడ్లను ఎలా కాపాడుకోవాలో తేలియక ఇబ్బంది పడుతున్నరు. మొక్కజొన్న పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వానలకు పంట దెబ్బతింటున్నది. చేలలో తెంపిక మక్క కంకులు వానలతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో కంకులు ఎండబెట్టుకోలేక అవస్థలు పడుతున్నారు.
వాన, చలికి పత్తి ఏరుతలేరు
వానలు, చలితో పత్తిలో తేమ శాతం 20 పైగా వస్తున్నది. మాయిశ్చర్ 8శాతం ఉంటేనే మద్దతు ధర రూ.8110 ఇస్తామని సీసీఐ అధికారులు చెబుతున్నారు. తేమ 12శాతం మించకుండా ఉంటేనే కొంటామని చెబుతున్నారు. దీంతో రైతులు పత్తి ఏరడం లేదు. డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. కొంత మంది యాసంగి పెట్టుబడుల కోసం కొంత పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
ఎఫ్సీఐ రూల్స్ మేరకే వడ్ల కొనుగోళ్లు
వడ్ల కొనుగోళ్లలోనూ తేమ పరేషాన్ తప్పడం లేదు. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం వడ్లు 17శాతం లోపు తేమ ఉంటేనే కొనుగోళ్లకు అనుమతిస్తున్నరు. నిబంధనలను తప్పని సరి పాటించాలనే ఎఫ్సీఐ ఆదేశాలతో సివిల్ సప్లైస్ శాఖ ఆ మేరకే కొనుగోళ్లు చేపడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలు, వాతావరణ పరిస్థితులతో వడ్లలో తేమ 25శాతం వరకు వస్తున్నది. ఆరబోసి అమ్ముకుందామంటే రోజు వాన కురుస్తున్నదని రైతులు వాపోతున్నరు.
మక్కలకు వానల దెబ్బ..
వానలకు మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. తెంపిన కంకులు మెషీన్‌లో మక్కలు పట్టించి ఆరబెడదామన ఎండలో పోస్తే వానలకు తడిసి ముద్దవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు కంకులు ఇరవకుండా చేనుపైనే ఉంచారు. మక్కల ఎంఎస్పీ రూ.2400 ఉండగా.. తేమ ఉందంటూ వ్యాపారులు రూ.1800 నుంచి రూ.2000 కంటే ఎక్కువ ధర పెట్టడం లేదు.
పత్తిని ఇంట్లోనే ఆరబెడుతున్నం
వానలకు పత్తి దెబ్బతింటున్నది. ఏరిన పత్తి ఆరక పోవడంతో తేమ శాతం ఎక్కువ ఉందని మార్కెట్‌లో కొంటలేరు. ఆరబెడుదామంటే ఎండ రావడం లేదు. ప్రతి రోజు వానలు పడుతున్నాయి. దీంతో పత్తిని ఇండ్లలోనే ఫ్యాన్ల కింద ఆరబెట్టుకుంటున్నం.
–కోరె శ్రీనివాస్, రైతు, ఆలేడు గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా
