రూ.50 లక్షలు శాలరీ ఉన్నా ఉద్యోగుల్లో రిచ్ ఫీలింగ్ లేదంట.. సీక్రెట్ చెప్పిన అడ్వైజర్

రూ.50 లక్షలు శాలరీ ఉన్నా ఉద్యోగుల్లో రిచ్ ఫీలింగ్ లేదంట.. సీక్రెట్ చెప్పిన అడ్వైజర్

ఏడాదికి రూ.50 లక్షల జీతం అనే పదం వినగానే చూసేవాళ్లకి ఇంకేముంది లగ్జరీ లైఫ్ గడపొచ్చు అని అనిపిస్తుంది. కానీ వాస్తవం ఇంకోలా ఉంటుందని ఆర్థిక సలహాదారు చంద్రలేఖా ఎం.ఆర్ చెబుతున్నారు. దేశంలో హై ప్యాకేజీలు పొందుతున్న ఉద్యోగులు ఎక్కువ డబ్బును పన్నులకు, ఖరీదైన లైఫ్ స్టైల్ ఖర్చులు, వ్యవస్థాపరమైన అసమానతల మధ్య ఇరుక్కుపోతున్నారని చెప్పారు చంద్రలేఖా.  

వాస్తవానికి రూ.50 లక్షల సీటీసీ కలిగిన ఉద్యోగి చేతిలో చివరికి సుమారుగా మిగిలేది జస్ట్ రూ.37 లక్షలే అని ఆమె వెల్లడించారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో లివింగ్, ఫుడ్, ట్రావెల్, పిల్లల విద్య తదితర ఖర్చులకు ఏడాదికి రూ.9–10 లక్షలు ఖర్చవుతాయని లెక్కలు చెప్పారు. దీని ఫలితంగా సుమారు రూ.27 లక్షలు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యక్తిగత జీవనానికి మిగులుతాయి. అంటే ఇలా లెక్కేసుకున్నా వారు కోటీశ్వరులుగా మారాలంటే కనీసం 4 నుంచి 5 ఏళ్లు డబ్బు సేవింగ్ చేయాల్సి ఉంటుందని రేఖా అన్నారు.   

కానీ ఇదే సమయంలో ఒక వ్యాపారి రూ.కోటి లాభం సంపాదిస్తే చట్టబద్ధంగా తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉందని చంద్రలేఖా వెల్లడించారు. దేశంలో పన్ను విధానాలు వ్యాపారాలను ప్రోత్సహించినా.. ఉద్యోగులకు తక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం అసమానతను సృష్టిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ఉద్యోగి ఎయిర్ పోర్టులో షాపింగ్ చేయటానికి కూడా వెనుకాడుతున్నట్లు ఆమె అన్నారు. అయితే అక్కడి లగ్జరీ స్టోర్లు తరతరాలుగా ధనికులైన కుటుంబాలు, విదేశీ ప్రయాణికులు, లేదా నెల జీతంపై ఆధారపడని వారిపై నడుస్తున్నాయని చెప్పారు.

రూ.50 లక్షల ఏడాది జీతంతో కూడా సరైన ఆర్థిక ప్రణాళికతో సౌకర్యవంతమైన జీవితం గడపవచ్చని ఆమె సలహా ఇచ్చారు. సరైన టాక్స్ ప్లానింగ్, ఖర్చులపై నియంత్రణ, పెట్టుబడుల్లో అవగాహన ఉంటే సంపదను వృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. లగ్జరీ షాపుల్లో రేట్లు చూడకుండా వస్తువులు కొనగలగటం సంపద కాదని.. డబ్బును నియంత్రించగలగటం అని రేఖా చెబుతున్నారు.