ఆరేండ్లకే అదిరిపోయే స్పీచ్ లతో చిన్నారి రికార్డ్​

ఆరేండ్లకే అదిరిపోయే స్పీచ్ లతో చిన్నారి రికార్డ్​

నాలుగేండ్ల వయసులో..105 నిమిషాల్లో 36 పుస్తకాలు చదివింది కియారా కౌర్​. అందుకుగానూ ‘గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​’లో చోటు దక్కించుకుంది. ఐదేండ్లు వచ్చేసరికి  ప్రపంచంలోనే అతి చిన్న  వయసు టెడెక్స్‌‌ స్పీకర్​గా నిలిచింది. ఇప్పుడు ఆరేండ్ల వయసులో దుబాయి​లో జరిగిన వరల్డ్​ 
"ఎక్స్​పో–2022 వేదికపై మాట్లాడింది. ఒకటో తరగతి చదువుతున్న ఈ చిన్నారి.. ‘చిన్న మార్పులు.. పెద్ద తేడా’ అంటూ వరల్డ్​ ఎక్స్​పోలో చేసిన  ప్రసంగానికి  ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది. అతి చిన్న వరల్డ్​ ఎక్స్​పో స్పీకర్’​గా గిన్నిస్​​ వరల్డ్​ రికార్డ్స్​ కూడా ఈ చిన్నారిని గుర్తించింది. ఈ  రికార్డుల చిన్నారి భారతీయ మూలాలున్న కుటుంబంలో పుట్టడం మరో విశేషం.


ఈ చిచ్చర పిడుగు తల్లిదండ్రులిద్దరూ చెన్నై లోనే పుట్టి, పెరిగారు. కానీ, వృత్తిరీత్యా పెండ్లి తర్వాత కొన్నాళ్లు అమెరికాలో ఉన్నారు. కియారా పుట్టాక అక్కడ్నించి దుబాయ్​కి షిఫ్ట్​ అయ్యారు. అయితే కియారాకి ‘పుస్తకాలంటే ఎందుకింత ఇష్టమ’ని పేరెంట్స్​ని అడిగితే.. ‘వాళ్ల తాతయ్య నుంచే తనకి ఈ ఆసక్తి వచ్చింద’ని చెప్పారు. కియారా తాతయ్యకి పుస్తకాలు తప్పించి మరో వ్యాపకం ఉండేది కాదట. కథలు, నవలలు బాగా చదివేవాడట. ఆ అలవాటే వారసత్వంగా ఈ చిన్నారికి వచ్చింది. అక్షరాలు నేర్చుకోవడం మొదలుపెట్టిన రోజు నుంచే పదాలు చదవడానికి ప్రయత్నించేదట కియారా. పోస్టర్లు, హోర్డింగులపై ఉన్న పదాల్ని కూడా వదిలిపెట్టేది కాదట. అది గమనించిన తల్లిదండ్రులు ఎంకరేజ్​ చేశారు. 
 

రికార్డులెన్నో.. 
అలా నాలుగేండ్ల వయసులో 105 నిమిషాల్లో 36 పుస్తకాలు చదివి రికార్డ్స్​కి ఎక్కింది కియారా. దాంతో పాటు ఆపకుండా అన్ని పుస్తకాలు చదివినందుకు ‘ఏసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్’​కి కూడా ఎక్కింది. కిందటి ఏడాది చిల్డ్రన్స్​ డేకి  టెడెక్స్​ స్పీకర్​గానూ మారింది . అందులో తన బుక్​ రీడింగ్​ జర్నీతో ఎందరినో ఇన్​స్పైర్​ చేసింది.  పోయిన నెలలో  ఏకంగా వరల్డ్​ ఎక్స్​ పో​  ఇంటర్నేషనల్​ విమెన్స్​ వీక్​ సెలబ్రేషన్స్​లోనూ  మాట్లాడింది. ఆ వేదికపై ఈ చిన్నారి విమెన్​ ఎంపవర్​మెంట్​ గురించి ‘చిన్న మార్పు.. పెద్ద తేడా’  అంటూ మాట్లాడిన మాటలు అందర్నీ కదిలించాయి. ఆడపిల్లలకి చదువు, హక్కులు, హెల్త్, డెసిషన్​ మేకింగ్, జీతాలు, ప్రొఫెషనల్ కెరీర్.. ఇలా అన్నింట్లో సమానత్వం లభించినప్పుడే అది నిజమైన విమెన్​ ఎంపవర్​మెంట్​ అవుతుందంటూ చెప్పిన మాటలకి  ప్రశంసలు దక్కాయి. ఈ స్పీచ్​ని చాలా రోజులు ప్రాక్టీస్​ చేసిందట కియారా. అయితే చిన్న వయసులో  అంతటి ప్రెస్టేజియస్​ స్టేజ్​ మీద మాట్లాడిన మొదటి చిన్నారి కియారానే అవడంతో మరోసారి వరల్డ్ గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లోకి కూడా ఎక్కింది. ఈ చిన్నారి ఒక పుస్తకం కూడా రాసింది.