నారింజ ప్రాజెక్టుకు నో రిపేర్..పైసలు ఉన్నా పట్టించుకోవట్లే!

నారింజ ప్రాజెక్టుకు నో రిపేర్..పైసలు ఉన్నా పట్టించుకోవట్లే!

పూడికతీత లేక నీళ్లన్నీ  పక్క రాష్ట్రానికి పోతున్నయ్

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కొత్తూరు (బి) నారింజ ప్రాజెక్టు రిపేరుకు నోచుకోవడం లేదు. ఫండ్స్​ ఉన్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును 1965-–70 మధ్య కాలంలో 0.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. కాగా ప్రాజెక్ట్ పూడికతీత పనులు ఏండ్ల కొద్దీ పెండింగ్  లో ఉన్నాయి.

రిపేర్ల కోసం రూ.5.5 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయినప్పటికీ ప్రత్యేక రాష్ట్రంలో  వచ్చినా ఇంకా పూర్తయిత లేవు. ప్రాజెక్టులో పూడికతీత పనులు లేక ఇక్కడి నీళ్లు పక్కనే ఉన్న కర్ణాటకకు పోతున్నాయి. దీంతో 12 వేల ఎకరాలకు సాగు నీరందక చాలామంది  రైతులు వ్యవసాయం విడిచిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై చాలాసార్లు జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో చర్చ జరిగినప్పటికీ ఫలితం మాత్రం కనిపిస్తలేదు. 

ఫండ్స్ పై గందరగోళం!

కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి గీతారెడ్డి నారింజ ప్రాజెక్టు పూడికతీతకు, గేట్ల రిపేర్లకు, కాల్వల నిర్మాణానికి 5.5 కోట్లు మంజూరు చేయించారు. రెండేళ్లలో రూ.1.5 కోట్ల పనులు మాత్రమే చేయడంతో కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టి అగ్రిమెంట్ క్యాన్సల్ చేశారు. 2020లో అప్పటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జోక్యం చేసుకొని అగ్రిమెంటు లేకుండా కొత్త కాంట్రాక్టర్ కు గేట్ల రిపేర్, పూడికతీత పనులు అప్పగించారు. గేట్ల రిపేర్ పూర్తిచేసి 1.25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు చేసినా కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించలేదన్న విమర్శలు వచ్చాయి. రూ.5.5 కోట్లలో దాదాపు రెండున్నర కోట్ల పనులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

మిగతా రూ.3 కోట్ల నిధులు ఉన్నా కాంట్రాక్టర్ కు అగ్రిమెంట్ లేకపోవడం, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగుతలేవన్న ప్రచారం జరుగుతోంది. ఫండ్స్ ఉన్నా మిగిలిన పనులు చేయించకపోవడం పట్ల నీటిపారుదల శాఖ ఆఫీసర్లపై ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు.ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి నారింజ ప్రాజెక్టుకు రిపేర్ పనులు చేపట్టి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

రూ.3 కోట్లు ఉన్నాయి

ఈఎన్ సీ అకౌంట్ లో రూ.3 కోట్లు ఉన్నాయి. వీటిని తిరిగి ప్రాజెక్టు రిపేర్ పనుల కోసం ప్రభుత్వ అనుమతితోనే ఖర్చు చేయాలి. కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఫండ్స్​ అలాగే ఉన్నాయి.  ప్రాజెక్టు చుట్టుపక్కల కెనాల్స్ కట్టేందుకు భూ సేకరణ సమస్య ఉంది. అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఖర్చు చేయలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నిధులు వినియోగిస్తాం. ఒకవేళ ఆ బ్యాలెన్స్ ఫండ్స్​తిరిగి పంపించమంటే గవర్నమెంట్ కు అప్పగిస్తాం.

- మురళీధర్, ఇరిగేషన్ ఎస్సీ