కర్నాటకలో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్​లో నయా జోష్

కర్నాటకలో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్​లో నయా జోష్

కాంగ్రెస్​లో నయా జోష్
కర్నాటకలో గెలుపుతో స్టేట్ కేడర్​లో ఉత్సాహం 
గాంధీభవన్​లో పటాకులు కాల్చి సంబురాలు 
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా 
వచ్చే ఎన్నికల్లో ‘పే సీఎం’ తరహా క్యాంపెయిన్​కు ప్లాన్
బీఆర్ఎస్​ అవినీతిని జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ స్టేట్ కాంగ్రెస్ కేడర్ లో కొత్త జోష్ నింపింది. ఇన్నాళ్లు నేతల మధ్య విభేదాలు, వివాదలతో సతమతమైన పార్టీకి ఈ విజయం ఉత్తేజాన్ని ఇచ్చింది. శనివారం ఉదయం కర్నాటక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పార్టీ లీడ్ పెరిగిపోగానే కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు భారీగా గాంధీభవన్​కు చేరుకున్నారు. పార్టీ విజయం ఖరారు కాగానే సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ ఆనందంగా కనిపించారు. కర్నాటకలో లాగానే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

విభేదాలున్నా ఒక్కటిగానే ముందుకు.. 

కాంగ్రెస్​అంటేనే వివాదాలకు కేరాఫ్​గా ఉండేది. మొన్నటి హాత్​సే హాత్​జోడో యాత్ర, నిరుద్యోగ నిరసన సభల సందర్భంగా పార్టీలో గొడవలు మరింత ముదిరాయి. ఏలేటి మహేశ్వర్​రెడ్డి సొంతంగా పాదయాత్ర చేయడం, దాన్ని ఠాక్రే నిలిపివేయడం.. దాంతో రేవంత్, మహేశ్వర్​రెడ్డి మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో బయటపడింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఏలేటి కాంగ్రెస్​పెద్దలకు షాకిస్తూ బీజేపీలోకి వెళ్లారు. ఆ తర్వాత నిరుద్యోగ నిరసన సభల సందర్భంగా ఉత్తమ్, రేవంత్​మధ్య విభేదాలు మరోసారి తీవ్రమయ్యాయి. అయితే నల్గొండ సభ ద్వారా అందరం కలిసే ఉన్నామన్న సంకేతాన్ని కాంగ్రెస్​పెద్దలు ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలిస్తే సీఎం ఎవరన్న దానిపై ఇప్పట్నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి.

జానారెడ్డి, రేవంత్, భట్టి విక్రమార్క వంటి వాళ్లు ఇప్పటికే సీఎం పదవి రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నది. విభేదాలు, వివాదాల మాట ఎలా ఉన్నా.. ఎన్నికలొస్తే మాత్రం కలిసే ముందుకు వెళ్తామంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. విభేదాలున్నా పార్టీ గెలుపు కోసం కలిసే పని చేస్తామని, కర్నాటకలోనూ విభేదాలున్నా కలిసి పని చేశారు కాబట్టే కాంగ్రెస్​ విజయం సాధించిందని పలువురు సీనియర్లు చెప్పుకొస్తున్నారు. నేతల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నా.. పార్టీ పరంగా మాత్రం అందరిదీ ఒకే సిద్ధాంతమని తేల్చి చెప్తున్నారు. ఈ ఫలితాల జోష్​నే రాబోయే తెలంగాణ ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తున్నది. 

హిందూ ఓటు బ్యాంకును కాపాడుకునేలా.. 

మరోవైపు హిందువులకు కాంగ్రెస్ ​వ్యతిరేకమనే వాదనల నుంచి బయటపడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నది. ‘మత విశ్వాసాలను నమ్ముతం. కానీ రాజకీయాలు చెయ్యం’ అంటూ ఇప్పటికే రేవంత్​స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కర్నాటక ఎన్నికల్లో బాగా ప్రచారం జరిగిన ‘బజరంగ్ బలి’ వివాదంపైనా కాంగ్రెస్​ శ్రేణులు దీటుగానే స్పందించాయి. హనుమాన్​చాలీసా పారాయణాలను పార్టీ నేతలు చేశారు. అంతేకాదు శనివారం ఎన్నికల కౌంటింగ్​ మొదలవగానే పీసీసీ చీఫ్​రేవంత్​సహా పలువురు నేతలు హనుమాన్​ టెంపుల్​కు వెళ్లి పూజలు చేశారు. దాంతో పాటు దర్గాలోనూ ప్రార్థనలు చేశారు.

ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు..

కర్నాటకలో కాంగ్రెస్​ గెలుపుకు ప్రధాన కా రణం ఆ పార్టీ చేసిన ‘పే సీఎం’ (PayCM) క్యాంపెయిన్ అని పార్టీ నేతలు చెప్తున్నారు. సునీల్​ కనుగోలు టీమ్​రూపొందించిన ఆ క్యాంపెయిన్ జనాల్లోకి బాగా వెళ్లిందని అంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ అలాంటి క్యాంపెయిన్​నే మొదలుపెట్టాలని స్టేట్ పార్టీ భావిస్తున్నది. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ స్వయంగా సీఎం కేసీఆరే చెప్పడం.. కాంగ్రెస్​సహా ప్రతిపక్షాలకు ఊతమిచ్చినట్టయింది. కాళేశ్వరం, మిషన్​భగీరథ, ఓఆర్ఆర్ టెండర్ల​వంటి వాటిలోని అవినీతి బయటపెడ్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్​సర్కా రు అవినీతి మీద కూడా స్పెషల్​క్యాంపెయి న్​ చేసేందుకు పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా నిరుద్యోగులకు సర్కారు చేసిన మోసం, టీఎస్​పీఎస్సీ పేప ర్ల లీకేజీపై కాంగ్రెస్ పోరాడింది. నిరుద్యోగులకు దగ్గరయ్యేందుకు వరుస కార్యక్రమాల ను నిర్వహించింది. యూత్​డిక్లరేషన్​, క్విజ్​ కాంపిటీషన్​వంటి వాటితోనూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. వారితో పాటు బీసీలు, మైనారిటీలు, దళితులకూ దగ్గరయ్యేలా ప్రణాళికలను రచిస్తున్నది. అం దుకోసం సునీల్​కనుగోలు టీమ్ గ్రౌండ్​ వర్క్​ఇప్పటికే స్టార్ట్​చేసిందని చెప్తున్నారు.