రెగ్యులర్​గా వర్కవుట్ చేస్తేనే రిజల్ట్​ కనిపిస్తుంది

రెగ్యులర్​గా వర్కవుట్ చేస్తేనే రిజల్ట్​ కనిపిస్తుంది

ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్​సైజ్ చేయడం చాలా ముఖ్యం. అందుకని ఫిట్​నెస్ గోల్ పెట్టుకుని  ప్లానింగ్ వేసుకుంటారు చాలామంది. కానీ, కొందరు  ‘రేపటి నుంచి చేద్దాం లే’ అనుకుంటూ వాయిదా వేస్తారు. మరికొందరేమో రెండు మూడు రోజులు లేదంటే వారాంతాల్లో వ్యాయాయం చేసి ‘హమ్యయ్య’ అనుకుంటారు. అయితే రెగ్యులర్​గా వర్కవుట్ చేస్తేనే రిజల్ట్​ కనిపిస్తుంది అంటున్నారు ఫిట్​నెస్​ ఎక్స్​పర్ట్స్. ఇష్టంగా వ్యాయామం చేసేందుకు ఏం చేయాలో చెప్పారు కూడా.  

ఎక్సర్​సైజ్​ చేసే ముందు వామప్​ చేయడం చాలా ముఖ్యం. అందుకని దాదాపు ఎనిమిది నిమిషాలు జాయ్​ వర్కవుట్స్ చేయాలి. అంటే... గాల్లో ఎగరాలి. గెంతాలి. ఒకపక్క నుంచి మరోపక్కకు వాలినట్టు కొంచెం సేపు నిల్చోవాలి.  ఈ జాయ్​ వర్కవుట్స్​ చేస్తే ఎక్సర్​సైజ్ చేసేందుకు కావాల్సిన ఉత్సాహం వస్తుంది. 

  • ఎప్పుడూ ఇండోర్​లో వర్కవుట్లు చేయాలంటే బోర్​ కొడుతుంది. అందుకని రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఆరు బయట వ్యాయామం చేయాలి. పచ్చని చెట్లు, పూల మొక్కలు ఉన్న దారిలో కాసేపు నడిస్తే...  ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దాంతో మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. పార్క్​ లేకుంటే ఉదయాన్నే ఎండలో నిల్చొని గట్టిగా గాలి పీల్చుకోవాలి. వర్కవుట్లు చేసేటప్పుడు జాగింగ్, రన్నింగ్ చేస్తున్నప్పుడు పాటలు విన్నా  అలసట తెలియదు. మరింత జోష్​గా ఎక్సర్​సైజ్ చేస్తారు.
  • కొందరు ఉదయం, మరికొందరు సాయంత్రం జిమ్ చేస్తారు. అయితే జిమ్​లో ఒకరిద్దరు కాకుండా గ్రూప్​గా వర్కవుట్స్​ చేస్తే  తొందరగా అలసిపోయినట్టు అనిపించదు. ఎక్సర్​సైజ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. 
  • అంతేకాదు వర్కవుట్​ చేసి బరువు తగ్గినవాళ్లు, ఫిట్​గా మారినవాళ్లని చూసి  ఇన్​స్పైర్ అవుతారు కూడా. ఇవేకాకుండా... వారంలో ఒకరోజు జిమ్ మెంబర్స్​తో కలిసి ఫన్​ గేమ్స్​ ఆడితే మంచిది. దాంతో మానసికంగా కూడా బలంగా అవుతారు.