రీయూజబుల్​ లాంచ్​ వెహికల్ క్షేమంగా దిగింది!

రీయూజబుల్​ లాంచ్​ వెహికల్ క్షేమంగా దిగింది!

చిత్రదుర్గ (కర్నాటక) : ఇస్రో మరో విజయం సాధించింది. ఆదివారం ఉదయం కర్నాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్​ టెస్ట్​రేంజ్(ఏటీఆర్)లో నిర్వహించిన రీయూజబుల్​ లాంచ్​ వెహికల్(ఆర్ఎల్వీ) ల్యాండింగ్​ ప్రయోగం సక్సెస్​ అయింది.  శాస్త్రవేత్తలు నిర్దేశించుకున్న విధంగా రీయూజబుల్​ లాంచ్​ వెహికల్(స్పేస్​ ప్లేన్)  నింగి నుంచి నేల వైపునకు దూసుకొచ్చి.. పూర్తి సెల్ఫ్​ కంట్రోల్​తో దానంతట అదే ఏటీఆర్ ​గ్రౌండ్​లో ల్యాండ్ అయింది. ప్రయోగంలో భాగంగా ఉదయం 7.10 గంటలకు ఆర్ఎల్వీ స్పేస్​ ప్లేన్​ను  తీసుకొని ఇండియన్​ఎయిర్​ఫోర్స్​కు చెందిన చినూక్​ హెలికాప్టర్ ​గాల్లోకి ఎగిరింది. అది ఆర్ఎల్వీని సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం ఇస్రో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు రాగానే.. చినూక్​ హెలికాప్టర్​ నుంచి ఆర్ఎల్వీ స్పేస్​ ప్లేన్​ను కిందికి వదిలింది.

తనలో ఉన్న ఇంటిగ్రేటెడ్​ నేవిగేషన్​ టెక్నాలజీ ద్వారా ఆర్ఎల్వీ నిట్టనిలువునా భూమివైపు దూసుకొచ్చింది. మార్గం మధ్య నుంచి తనపై తాను కంట్రోల్ పొంది.. జర్నీ మొదలుపెట్టింది. లాంచ్​ సైట్​కు చేరువకాగానే దానిలోని ప్యారచూట్​ విచ్చుకుంది. ఉదయం 7.40 గంటలకు అది ల్యాండ్​ అయింది. అంటే అర్ధగంట వ్యవధిలోనే ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో ఉపయోగించిన ఆర్ఎల్వీ పొడవు 6.5 మీటర్లు, వెడల్పు 3.6 మీటర్లు. 

స్పేస్​ టూరిజం టెక్నాలజీ దిశగా.. 

ఇక తమ తదుపరి లక్ష్యం.. ఆర్బిటల్​ రీ ఎంట్రీ (ఓఆర్ఈ) ప్రయోగమే అని ఇస్రో చెబుతోంది. స్పేస్​ ప్లేన్​ను ఒక ప్రత్యేక అసెంట్​ వెహికల్​ ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. అక్కడ నిర్ణీత సమయం పాటు ఉన్నాక, భూమికి తిరిగొచ్చేలా చేయడమే ఓఆర్ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఇది కూడా సక్సెస్​ అయితే స్పేస్​ టూరిజానికి ఇస్రో కూడా రెడీ అయినట్టు అవుతుంది. ఓఆర్ఈ టెక్నాలజీని స్పేస్​ ఎక్స్​, బ్లూ ఆరిజిన్, బోయింగ్​ కంపెనీలు కలిగి ఉన్నాయి.

మరిన్ని వెహికల్స్ తయారీ..

తాజా ప్రయోగం సక్సెస్​ కావడంతో ఇస్రో వివిధ రకాల లాంచ్​ వెహికల్స్ ​తయారు చేసేందుకు తలుపులు తెరుచుకుంటాయి. స్పేస్​ లాంచ్​ వెహికల్స్​ మార్కెట్​లో ఇస్రోకు విదేశాల నుంచి బిజినెస్​ ఆర్డర్స్​ కూడా పెరుగుతాయి.  ‘‘ఆర్బిటల్​ రీ ఎంట్రీ స్పేస్​ వెహికల్స్​ తయారు చేయాలనే మా చిరకాల స్వప్నానికి చేరువయ్యాం. భారతదేశపు తొలి రీయూజబుల్​ లాంచ్​ వెహికల్ ఇక త్వరలోనే అందుబాటులోకి వస్తుంది” అని ఇస్రో చైర్మన్​ ఎస్​.సోమనాథ్​  తెలిపారు. సెంటర్​ ఫర్​ మిలిటరీ ఎయిర్​ వర్తీనెస్​ అండ్​ సర్టిఫికేషన్(సీఈఎంఐఎల్ఏసీ), ఏరోనాటికల్​ డెవలప్​మెంట్​ ఎస్టాబ్లిష్​మెంట్​(ఏడీఈ), ఏరియల్​ డెలివరీ రీసెర్చ్​ అండ్​ డెవలప్​ మెంట్​ ఎస్టాబ్లిష్​మెంట్​(ఏడీఆర్​డీఈ) సంస్థలు ఈ ప్రయోగంలో సహకరించాయని చెప్పారు.