V6 News

Vijay Deverakonda: హాలీవుడ్ రేంజ్‌లో విజయ్ దేవరకొండ మూవీ.. '#VDx శౌర్యువ్' మేకింగ్ మామూలుగా లేదుగా!

 Vijay Deverakonda: హాలీవుడ్ రేంజ్‌లో విజయ్ దేవరకొండ మూవీ.. '#VDx శౌర్యువ్' మేకింగ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యూవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం '#VDx శౌర్యువ్' . భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో  మాత్రమే కాకుండా.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ ప్రాజెక్ట్ ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి అంచనాలను మరింత పెంచుతోంది.

గ్లోబల్ ప్రాజెక్టుగా.. 

ఈ  '#VDx శౌర్యువ్' సినిమా కేవలం ఒక ప్రాంతీయ చిత్రంలా కాకుండా, ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌లా రూపుదిద్దుకుంటోంది. దీనికి ప్రధాన కారణం ఈ చిత్రానికి పనిచేస్తున్న ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్: హౌస్ ఆఫ్ ది డ్రాగన్', 'ఫాల్ అవుట్' వంటి పాపులర్ సిరీస్‌లకు పనిచేసిన మెక్సికన్ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తున్నారు. 'స్నోపీర్సర్', 'బ్యాట్‌మాన్ ఫరెవర్' వంటి హాలీవుడ్ చిత్రాలకు ఎమ్మీ అవార్డు గెలుచుకున్న ఎరిక్ డర్స్ట్ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తున్నారు.

పవర్ ఫుల్ పోస్టర్..

ఇటీవల విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా మూడ్‌ను చెప్పకనే చెప్పింది. విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు కుక్కలను ఇనుప గొలుసులతో పట్టుకుని, ఎంతో ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటూ వస్తుంటే, ఆయన వెనుక కొంతమంది అనుసరిస్తున్న తీరు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఇది ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా అని, విజయ్ క్యారెక్టర్ ఎంతో ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఖుషీ, హాయ్ నాన్న ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మరోసారి తన మ్యూజిక్ మ్యాజిక్ చూపించబోతున్నారు. 'యానిమల్', 'ఓం శాంతి ఓం' వంటి భారీ చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ అద్భుతమైన సెట్లను నిర్మిస్తున్నారు. 'తుంబాడ్', 'సామ్ బహదూర్' ఫేమ్ సచిన్ లోవలెకర్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక భిన్నమైన రోల్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. శౌర్యూవ్ తన మొదటి సినిమాతోనే క్లాస్ ప్రేక్షకులను మెప్పించగా, ఈసారి మాస్,  గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 'విజయ్ ఎనర్జీ,  హాలీవుడ్ టెక్నీషియన్స్' కలయికలో రాబోతున్న ఈ సినిమా భారతీయ సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి..