సిటీలో బైక్ జర్నీ.. సో రిస్క్ గురూ..

సిటీలో బైక్ జర్నీ.. సో రిస్క్ గురూ..
  • ట్రాఫిక్ జామ్..డైవర్షన్లతో నరకంగా ప్రయాణం
  • మట్టి, ఇసుకతో  స్కిడ్ అయి యాక్సిడెంట్లు
  • రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో
  • 44.5 శాతం బైకర్లే
  •  ప్రసుత్తం సిటీలో 68 లక్షల బైక్ లు

మాదాపూర్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు  బైకర్లను బెంబేలెత్తిస్తున్నాయి.  ట్రాఫిక్ జామ్, డైవర్షన్లతో నరకం చూస్తున్నారు. ప్రస్తుతం సిటీలో 68 లక్షల బైక్ లు​ఉండగా.. ఆఫీసులు, ఇతర పనులపై బయటకు వెళ్లాలంటే చాలామంది టూవీలర్​నే ఎక్కువగా వాడుతుంటారు. అయితే, హెవీ వెహికల్స్, కార్లతో జరిగే ప్రమాదాల్లో బైక్ రైడర్లే ఎక్కువగా చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 44.5 శాతం మంది బైకర్లేనని ఎన్ సీఆర్ బీ ( నేషనల్ క్రైమ్​రికార్డ్స్​బ్యూరో ) గతేడాది లెక్కలు తెలియజేస్తున్నాయి. లారీలు, రెడీమిక్స్ వాహనాలు, కార్ల కారణంగానే బైక్ రైడర్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి పూట బైక్ పై వెళ్లాలంటే రిస్క్​తో కూడుకున్న పని అని పలువురు వాహనదారులు చెబుతున్నారు.

కోటికి పైగా జనాభాకు 6 శాతమే రోడ్లు..

సిటీలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువే.  సిటీలో  మొత్తంగా 625 చదరపు కిలోమీటర్ల రోడ్లు ఉండాలి. కానీ.. పెరిగే వెహికల్స్​కు ఇవి సరిపోవడం లేదు. గ్రేటర్​విస్తీర్ణం రూల్స్ ప్రకారం 10 శాతం రోడ్లు ఉండాల్సి ఉండగా..  ప్రస్తుతం 6  శాతం మాత్రమే ఉన్నాయని ఎక్స్ పర్ట్స్​చెబుతున్నారు.  ముఖ్యంగా ఉప్పల్ నుంచి బేగంపేట మీదుగా హైటెక్ సిటీ, కోఠి నుంచి అమీర్​ పేట్​మీదుగా లింగంపల్లి రూట్, మెహిదీపట్నం నుంచి హైటెక్ సిటీ రూట్, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ రూట్ లో ఉదయం, సాయంత్రం రద్దీ విపరీతంగా ఉంటుంది. ట్రాఫిక్ రద్దీతో ఆఫీసులకు కూడా లేట్ అవుతుందని పలువురు ఎంప్లాయీస్ పేర్కొంటున్నారు.  

ఓవర్ స్పీడ్ ..

బైక్ జర్నీ ఈజీగా ఉండేలా సిటీ రోడ్లను డిజైన్ చేసేందుకు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సర్కారు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. చాలా ప్రాంతాల్లో  రోడ్ల వెడల్పు తగినంతగా లేదు.  దీంతో కొందరు తొందరగా గమ్యాన్ని చేరుకునేందుకు ఓవర్ స్పీడ్  తో బైక్ డ్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రివేళల్లోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాత్రిపూట బైక్​పై వెళ్లే వారికి నైట్​విజన్​సరిగా లేకపోవడం, రోడ్లపై మట్టి, ఇసుక ఎక్కువగా ఉండడం లాంటివి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 

వాన పడితే ఆగమే..

సిటీలో వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఎక్కడ గుంతలు, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. వాన పడినప్పుడు రోడ్లపై నిలిచే వరద నీటిలో స్కిడ్ అయి ఎక్కడ పడిపోతామోనని భయం భయంగా వెళ్తుంటారు. ఇక వానకు ట్రాఫిక్ జామ్ తోడైతే  సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేసరికి ఒక్కోసారి అర్ధరాత్రి అవుతుందని పలువురు వాహనదారులు చెబుతున్నారు.

పొల్యూషన్‌ సమస్యలు..

బైక్ లపై వెళ్లేవారిని పొల్యూషన్ సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. రోడ్డుపై దుమ్ము, ధూళి లేచి కండ్లలో పడటంతో జర్నీ ఇబ్బంది మారింది. పొల్యూషన్ కారణంగా లంగ్స్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఎక్కువ సేపు డ్రైవింగ్​చేస్తే కండ్ల మంట వస్తోందంటున్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా పొల్యూషన్ సమస్య ఉంటోందంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ 350 నుంచి 400 వరకు ఉంటోంది. 4 నెలల కిందట ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లోనూ హైదరాబాద్ పొల్యూషన్ పెరుగుతున్నట్లు తేలింది. మెట్రో సిటీస్ ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, బెంగళూరు,  హైదరాబాద్ లో అత్యధికంగా బెంగళూరు, హైదరాబాద్ లోనే పొల్యూషన్ పెరుగుతున్నట్లు రిపోర్టు తేల్చింది.

రోడ్ల డిజైన్ లో లోపాలు.. 

సిటీ రోడ్లపై బైక్ లు నడిపేవారు ఈజీ జర్నీ చేసేలా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీస్కోవాలి. రోడ్ల డిజైన్ లో లోపాలు  ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోజుకు 25 నుంచి 30 కిలోమీటర్లు జర్నీ చేసే బైక్ రైడర్లు బ్యాక్ పెయిన్ బారిన పడుతున్నారు. రోజంతా బైక్  నడిపే వారిలో ఇది మరింత ఎక్కువగా ఉంటొంది. పొల్యూషన్​ కారణంగా చర్మవ్యాధులు, లంగ్స్​ఎఫెక్ట్​సమస్య ఎక్కువగా వస్తుంది.
– లక్ష్మణ్​రావు, కో ఆర్డినేటర్, సెంటర్ ఫర్​ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్, జేఎన్‌టీయూ

భారీ వెహికల్స్ తో భయం..

ఓవర్ స్పీడ్‌తో దూసుకువెళ్లే భారీ వెహికల్స్, కార్లు ఎటువైపు నుంచి వచ్చి ఢీకొడతాయో తెలియడం లేదు. భారీ వెహికల్స్ పక్క నుంచి వెళ్తుంటేనే భయం వేస్తుంది. బైక్ పై కాలేజీకి ఇన్ టైమ్ లో వెళ్లలేకపోతున్నా.
–  వికాస్​రెడ్డి, స్టూడెంట్,ఉప్పల్

గంటన్నర ముందే.. 

సిటీలో బైక్​ నడపాలంటే భయంగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది అవుతోంది.  కాలేజీకి వెళ్లాలంటే గంటన్నర ముందే బయలుదేరాల్సి వస్తోంది. పొల్యూషన్​ సమస్య కూడా ఎక్కువగా ఉంది.  

– తేజస్వి, సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్

ట్రాఫిక్, పొల్యూషన్ ఎక్కువ..

సిటీలో ట్రాఫిక్, పొల్యూషన్ రెండింటితో సమస్య ఎక్కువగా ఉంది. హెల్మెట్ పెట్టుకున్నా రోడ్లపై దుమ్ము కండ్లలోకి వచ్చి చేరుతోంది. ట్రాఫిక్ లో ఎక్కువ సేపు స్కూటీ నడిపిన వారిని బ్యాక్ పెయిన్ సమస్య వేధిస్తోంది. రోజుకు 25 కి.మీ దూరం వెళ్లే వారిలో బ్యాక్ పెయిన్ సమస్య ఎక్కువగా ఉంటోంది.  
–  డా. శ్రీకాంత్​రెడ్డి, న్యూరో అండ్​ స్పైన్​ సర్జన్​ మెడికవర్​ హాస్పిటల్