గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం వెనుక సీక్రెట్ ఇదే!

గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం వెనుక సీక్రెట్ ఇదే!

ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుట్టినా, అద్భుతమైన పాట వింటున్నప్పుడు మైమరిచిపోయినా లేదంటే చల్లని గాలి తాకగానే ఒక్కసారిగా చర్మంపై చిన్న చిన్న బుడిపెలు వస్తాయి. దీనినే మనం 'గూస్‌బంప్స్' అంటుంటాం. క్షణాల్లో వచ్చి మాయమయ్యే ఈ శారీరక మార్పు వెనుక లక్షల ఏళ్ల నాటి పరిణామ క్రమ రహస్యం దాగి ఉందంటే నమ్ముతారా? అసలు మన శరీరం ఇలా ఎందుకు స్పందిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

మనం భయపడినా లేదా భావోద్వేగానికి లోనైనా మన మెదడు వెంటనే అడ్రినలిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ సంకేతం అందగానే చర్మం లోపల వెంట్రుకల కుదుళ్లకు అంటుకుని ఉండే అరెక్టర్ పిలి అనే సూక్ష్మ కండరాలు ఒక్కసారిగా సంకోచిస్తాయి. ఫలితంగా చర్మం పైకి చిన్న బుడిపెల్లా వచ్చి.. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఈ మొత్తం ప్రక్రియ సెకనులో పదో వంతు కాలంలోనే జరిగిపోతుంది. 

మన పూర్వీకులకు శరీరంపై నిండా వెంట్రుకలు ఉండటం వల్ల.. ఈ గూస్‌బంప్స్ వారికి రెండు రకాలుగా ఉపయోగపడేవి. మొదటిది చలి నుంచి రక్షణ. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నప్పుడు వాటి మధ్య గాలి నిలిచిపోయి, అది ఒక ఇన్సులేషన్ పొరలా పనిచేసి శరీరాన్ని వెచ్చగా ఉంచేది. రెండోది ఆత్మరక్షణ. జంతువులు భయపడినప్పుడు వాటి వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం వల్ల అవి పరిమాణంలో పెద్దవిగా కనిపిస్తాయి. పిల్లులు, ముళ్లపందులు శత్రువును భయపెట్టడానికి ఇదే ట్రిక్ ఉపయోగిస్తాయి. మనుషులు పరిణామ క్రమంలో ఒంటిపై జుట్టును కోల్పోయినా.. ఆ పాత సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ మాత్రం మన శరీరంలో ఇంకా అలాగే ఉండిపోయింది.

అయితే కేవలం భయం లేదా చలికే కాకుండా సంగీతం విన్నప్పుడు కూడా ఎందుకు గూస్‌బంప్స్ వస్తాయనేది ఆసక్తికరమైన అంశం. మన మెదడులోని భావోద్వేగ కేంద్రాలు, శారీరక ముప్పును గుర్తించే కేంద్రాలు ఒకే మార్గంలో అనుసంధానమై ఉంటాయి. ఏదైనా అద్భుతమైన రాగం విన్నా లేదంటే సన్నివేశం చూసినప్పుడు మెదడు పొరపాట్లు పడి అడ్రినలిన్‌ను విడుదల చేస్తుంది. అందుకే మనం సురక్షితంగా ఉన్నా సరే, మన శరీరం మాత్రం ప్రాచీన కాలపు జీవిలా స్పందిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. గూస్‌బంప్స్ అనేవి మన పూర్వీకుల నుంచి మనకు అందిన ఒక ఘోస్ట్ సిగ్నల్.